Begin typing your search above and press return to search.

బెంగళూరు రోడ్లు .. నరకానికి నకళ్లు !

తాజాగా గురువారం వైట్ ఫీల్డ్ - వర్తూర్ - గుంజూర్ కారిడార్ ఎస్ హెచ్ 35 మీద ఎదురైన ట్రాఫిక్ సమస్య బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

By:  Garuda Media   |   18 Sept 2026 1:20 PM IST
బెంగళూరు రోడ్లు .. నరకానికి నకళ్లు !
X

బెంగళూరు అంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేది ట్రాఫిక్ సమస్య. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన ఈ గార్డెన్ సిటీలో ట్రాఫిక్ పేరు చెబితే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. తాజాగా గురువారం వైట్ ఫీల్డ్ - వర్తూర్ - గుంజూర్ కారిడార్ ఎస్ హెచ్ 35 మీద ఎదురైన ట్రాఫిక్ సమస్య బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

గురువారం సాయంత్రం స్కూల్ బస్సులు 5 లేదా 6 కిలోమీటర్ల దూరానికి రెండున్నర గంటలకు పైగా సమయం పట్టింది. టీఎస్ఐబీ నుండి ప్రెస్టీజ్ లేక్ సైడ్ హ్యాబిటట్ (PLH) వరకు 6 కిలోమీటర్ల దూరానికి 2.15 గంటలు, ఇన్వెంచర్ అకాడమీ నుండి పీఎల్ హెచ్ వరకు ఆరు కిలోమీటర్ల దూరానికి 2.30 గంటలు, గ్రీన్ ఉడ్ హై మీద 5 కిలోమీటర్లకు 2.50 గంటలు, యునైటెడ్ వరల్డ్ అకాడమి మీద 5 కిలోమీటర్ల దూరానికి 2 గంటల సమయం పట్టింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పరిస్థితి మీద నిస్సహాయత వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా, పిల్లలు, ఉపాధ్యాయులు ఏడు గంటల పాటు రోడ్ల మీదే గడిపారు. ఇది ఒక్కసారి కాదు. మాకు తక్షణ సాయం కావాలి అని అకాడమీ వ్యవస్థాపకురాలు విజ్ఞప్తి చేసింది.

పరీక్షల సమయం కావడంతో బస్సులు ఆలస్యమై విద్యార్థులు ఆందోళనతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలలు అదనపు సమయం కేటాయించాల్సి వచ్చింది. 2500 మందికి పైగా తల్లిదండ్రులు ఆన్ లైన్ పిటీషన్ మీద సంతకాలు చేసి రహదారులు మరమ్మతులు చేయాలని, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ చేయాలని అధికారులను అభ్యర్థించారు. పిల్లలు ధూళి, గుంతలు, మట్టి రోడ్ల మీద గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులు బస్సును కాదని ద్విచక్రవాహనాలను ఉపయోగిస్తున్నారు. ఏడాది మొత్తం కలిపితే విద్యార్థులు, ఉపాధ్యాయులు 500 నుండి 600 గంటలు రోడ్ల మీద గడుపుతున్నారని అంచనా.

ఈ నేపథ్యంలో స్కూల్ టైమింగ్స్ లో భారీ వాహనాలను నిషేధించాలని, ఎస్ హెచ్ 35 రోడ్డు విస్తరణ వేగవంతం చేయాలని, రోడ్ల నిర్వహణ మెరుగు పరచాలని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద దృష్టి సారించాలని, రహదారుల మీద గుంతలు పూడ్చాలని, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుతున్నారు.

దీంతో పాటు స్కూల్ కారిడార్లకు ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు అమలు చేయాలని, ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాలని, స్థానిక అధికారులు, తల్లిదండ్రుల ప్రతినిధులు కలిసి సమస్యలను అధ్యయనం చేసి సమన్వయంతో పరిష్కరించుకోవాలని అంటున్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందిస్తే పిల్లల సమయం, ఆరోగ్యం, భద్రత కాపాడగలుగుతామని అంటున్నారు.