Begin typing your search above and press return to search.

ఏడాదిలో రూ.200 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లా... వామ్మో!

అవును... మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని.. ఉరుకులు పరుగుల జీవితంలో ఇవి ఒక భాగం అయిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   14 Nov 2025 6:00 PM IST
ఏడాదిలో రూ.200 కోట్లకు పైగా ట్రాఫిక్  చలాన్లా... వామ్మో!
X

ట్రాఫిక్ జరిమానాల విషయంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఇందులో భాగంగా... బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తొలిసారిగా ఒకే సంవత్సరంలో రూ.200 కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేశారు. ఈ ఏడాది జనవరి – అక్టోబర్ మధ్య అధికారులు ఈ రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో సుమారు 51.8 లక్షల మంది ట్రాఫిక్ ఉల్లంఘనదారుల నుండి రూ.207.35 కోట్ల విలువైన జరిమానాలను వసూల్ చేశారు!

అవును... మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని.. ఉరుకులు పరుగుల జీవితంలో ఇవి ఒక భాగం అయిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ట్రాఫిక్ జరిమానాల విషయంలో బెంగళూరు నగరం సరికొత్త చరిత్ర సృష్టించింది. వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే ట్రాఫిక్ ఉల్లంఘనదారుల సంఖ్య తక్కువే అయినా.. అమౌంట్ మాత్రం డబుల్!

వాస్తవానికి బెంగళూరు నగరంలో ట్రాఫిల్ ఉల్లంఘనల కేసులు గత ఏడాది 12 నెలల్లోనూ 82.9 లక్షలు నమోదవ్వగా... వాటి ద్వారా వసూలైన జరిమానా మొత్తం రూ. 84.91 కోట్లుగా ఉండగా... ఈ ఏడాది తొలి 10 నెలల్లోనే కేసుల సంఖ్య 51.8 లక్షలే అయినా.. జరిమానాల మొత్తం మాత్రం రూ.207.35 కోట్లు కావడం గమనార్హం.

అయితే... ఈ ఏడాది ఈ స్థాయిలో ట్రాఫిక్ వసూళ్లు పెరగడానికి ఒక ముఖ్య కారణం.. పెండింగ్ జరిమానాలపై రాయితీ ఇవ్వడమేనని అంటున్నారు. ఇందులో భాగంగా... ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 14 వరకు బకాయిలపై 50 శాతం డిస్కౌంట్ అందించారు భెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. దీంతో... ఆ కాలంలోనే సుమారు 3.86 లక్షల కేసులు క్లియర్ అయ్యాయని.. తద్వారా ఒక్కసారిగా రూ.106 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కార్తీక్ రెడ్డి.. ఈ రాయితీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని.. చాలామంది పౌరులు పాత బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. 2025లో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల్లో హెల్మెట్ లేని డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ కేసుల సంఖ్య 15.85 లక్షలని వెల్లడించారు.

ఏఐ-ఆధారిత కెమెరాల పెర్ఫార్మెన్స్ కీలకం!:

బెంగళూరు ట్రాఫిక్ అమలు విభాగం ఏఐ-ఆధారిత కెమెరాలు, ఈ-చలాన్లపై ఎక్కువగా ఆధారపడటం కొనసాగిస్తోంది. ఈ చర్య ఆన్ గ్రౌండ్ పోలీసింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ క్రమంలో... 2024లో 94 శాతం ఉల్లంఘనలు ఆటోమేటెడ్ సిస్టమ్‌ ల ద్వారా బుక్ చేయబడగా... ఈ సంవత్సరం ఆ సంఖ్య ఇప్పటివరకు 87 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.