బెంగళూరు ట్రాఫిక్ అరాచకంపై శుభాన్షు శుక్లా చురకలు
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా : బెంగళూరు ట్రాఫిక్‌కు ఒక సానుకూలమైన అంశం ఉంది.
By: Garuda Media | 21 Nov 2025 9:47 AM ISTఒకప్పుడు గార్డెన్ సిటీగా మనసు దోచేసిన బెంగళూరు మహానగరం.. ఇప్పుడు అక్కడి ట్రాఫిక్ వారు వీరు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పీడకలగా మారుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉండే వారు మాత్రమే కాదు.. ఆ నగరానికి అతిధులుగా వచ్చే వారంతా అక్కడి ట్రాఫిక్ అరాచకానికి బాధితులుగా మారటం.. తాము ఎదుర్కొన్న ఇబ్బందిని చురకల రూపంలో ప్రస్తావించటం తెలిసిందే. ఎవరెన్ని అంటున్నా.. బెంగళూరు ట్రాఫిక్ జాంలను తగ్గించే విషయంలో ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. బెంగళూరుకు వచ్చే వారంతా అక్కడి ట్రాఫిక్ కు బాధితులే. తాజాగా ఇదే తరహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు ఇటీవల అంతరిక్షయానం చేసిన వ్యోమగామి శుభాన్షు శుక్లా. బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్ కు హాజరైన ఆయన.. ‘ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్’ లో పాల్గొనేందుకు మారతహళ్లి నుంచి మూడు గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చిందన్నారు.
అంతేకాదు.. తన జర్నీలో మూడో వంతు సమయంలోనే తన ప్రసంగాన్ని పూర్తి చేసినట్లుగా పేర్కొంటూ.. తన అంతరిక్ష అనుభవాల్ని తనదైన శైలిలో వివరించారు. గత జూన్ లో యాగ్జియం మిషన్ ద్వారా అంతరిక్షయాత్రను విజయవతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో అడుగు పెట్టిన తర్వాత మన గుండెపై మోటారు వాహనం ప్రయాణించినట్లుగా ఉంటుందన్న ఆయన.. ‘‘అక్కడకు చేరుకున్న తర్వాత అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కనీసం వారం పడుతుంది. భూమికి వచ్చాక రెండు వారాల పాటు శరీరం అదుపు తప్పే ఉంటుంది’’ అని చెప్పిన ఆయన.. అంతరిక్షం నుంచి భారత్ ఏ విధంగా కనిపిస్తుందనన వీడియోను శుభాన్షు చూపించారు.
బెంగళూరు దారుణ ట్రాఫిక్ గురించి ఇప్పటికే పలువురు ప్రముఖులు తమదైన శైలిలో చురకలు వేయటం తెలిసిందే. నిజానికి తీవ్రమైన ట్రాఫిక్ సమస్య కారణంగా పలు సంస్థలు ఆ నగరంలో తమ విస్తరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని వేరే నగరాలకు తరలి వెళుతున్న దుస్థితి. ఇటీవల కాలంలో బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై తమదైన శైలిలో చురకలు.. వ్యాఖ్యలు చేసిన ప్రముఖులు పలువురు ఉన్నారు. వారేమన్నారన్నది వారి మాటల్లో చదవితే.. బెంగళూరు ట్రాఫిక్ ఎంత నరకంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా : బెంగళూరు ట్రాఫిక్‌కు ఒక సానుకూలమైన అంశం ఉంది. "ట్రాఫిక్‌లో తరచూ ఆగిపోవడం వల్ల, మీ కారు పక్కనే ఆగి ఉన్నవారికి దాన్ని పూర్తిగా చూసేందుకు, పరిశీలించేందుకు బోలెడంత సమయం దొరుకుతుంది"
మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మొహన్‌దాస్ పాయ్ : బెంగళూరు ట్రాఫిక్ ఒక కాల్పనిక 'చార్ జామ్ యాత్ర' ను పోలి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్, సిల్క్‌బోర్డ్ జంక్షన్ లాంటి అత్యంత రద్దీ ప్రాంతాలను ఈ "టూర్"లో చేర్చారు.
హాట్‌మెయిల్ సహ-వ్యవస్థాపకుడు సాబీర్ భాటియా : బెంగళూరు ట్రాఫిక్ "పిచ్చిగా" ఉంటుంది.బే ఏరియాతో పోలిస్తే అదే దూరాన్ని సైకిల్‌పై మూడింట ఒక వంతు సమయంలో చేరుకోవచ్చు. ఈ నగరవాసులు దీన్ని రోజూ ఎలా తట్టుకుంటున్నారో?
బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా : బెంగళూరు నగర ప్రతిష్ఠను దెబ్బ తీస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారుల సహనానికి పరీక్ష పెడుతుంది.
పీక్ XV మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్: బెంగళూరు ఎయిర్ పోర్టుకు క్యాబ్‌లో వెళ్లడానికి పట్టే సమయం, బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించే సమయం సమానంగా ఉంది.
