Begin typing your search above and press return to search.

పేద లుక్ బెటర్.. బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్.. ఆ ‘టాక్స్’ ఏంటో తెలుసా?

ఆధునిక సమాజంలో ఒకప్పుడు సంపద అనేది దాచుకునే వస్తువు.. కానీ నేటి డిజిటల్ యుగంలో అది ఒక 'ప్రదర్శన' వస్తువుగా మారిపోయింది.

By:  A.N.Kumar   |   19 July 2026 5:28 PM IST
పేద లుక్ బెటర్.. బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్.. ఆ ‘టాక్స్’ ఏంటో తెలుసా?
X

ఆధునిక సమాజంలో ఒకప్పుడు సంపద అనేది దాచుకునే వస్తువు.. కానీ నేటి డిజిటల్ యుగంలో అది ఒక 'ప్రదర్శన' వస్తువుగా మారిపోయింది. చేతిలో ఐఫోన్, వేల రూపాయల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కార్లు ఉంటేనే సమాజంలో ఒక హోదా దక్కుతుందనే భ్రమలో మెజారిటీ ప్రజలు బతుకుతున్నారు. అయితే ఇలా 'ధనవంతుడిలా కనిపించడం' వల్ల సమాజం మన నుంచి ఎంత దోచుకుంటుందో తెలుసా? సరిగ్గా ఇదే పాయింట్‌ను టచ్ చేస్తూ బెంగళూరుకు చెందిన మీనాంక్ మిన్ను అనే ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లింక్డ్‌ఇన్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డబ్బు ఉన్నప్పటికీ తాను ఉద్దేశపూర్వకంగానే "పేదవాడిలా" కనిపించేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పిన మాటలు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీశాయి.

'లుక్స్ రిచ్ ట్యాక్స్' .. అసలేంటి కథ?

ఖరీదైన వస్తువులు వాడటం, విలాసవంతంగా కనిపించడం వల్ల మనకు తెలియకుండానే ఒక అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందని మీనాంక్ అభిప్రాయపడ్డారు. దీనిని ఆయన ‘లుక్స్ రిచ్ ట్యాక్స్’ అని పిలిచారు. సమాజంలో మనం ధనవంతుల్లా కనిపిస్తే ప్రజలు, వ్యాపారులు, సేవలు అందించే వారు మన దగ్గర అదనపు ధరలు వసూలు చేస్తారని ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. "మీరు ధనవంతులా కనిపిస్తే మార్కెట్లో బంగాళాదుంపల ధర కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. రూ.20 కిలో ఉండాల్సినది రూ.28 అవుతుంది. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే.. సామాన్యుడికి రూ.500 ఫైన్ వేసే చోట.. కార్లో ఉన్నవాడికి రూ.1,500 చెల్లించాల్సి వస్తుంది. చేతిలో ఐఫోన్ కనిపిస్తే.. రూ.200 విలువైన మొబైల్ కవర్‌కు రూ.700 చెబుతారు. వీటన్నింటికీ మించి, మన దగ్గర డబ్బు ఉందని తెలిస్తే తిరిగి ఇవ్వని అప్పులు అడిగేవాళ్లు కూడా ఎక్కువ అవుతారు" అని ఆయన వివరించారు.

ఐఫోన్ వదిలేశారు.. కానీ చౌకైనవి కొనలేదు

తాను ఒకప్పుడు ఐఫోన్, మ్యాక్‌బుక్ ఉపయోగించేవాడినని, అయితే వాటిని అమ్మేసి ప్రస్తుతం వివో స్మార్ట్‌ఫోన్, ఆసుస్ ల్యాప్‌టాప్ వాడుతున్నానని తెలిపారు. అలాగే ఇప్పటికీ 10 ఏళ్ల పాత హ్యాచ్‌బ్యాక్ కారునే నడుపుతున్నానని చెప్పారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం తాను వాడుతున్న వివో ఫోన్ పాత ఐఫోన్ కంటే ఖరీదైనదే.. ఆసుస్ ల్యాప్‌టాప్ కూడా మ్యాక్‌బుక్ కంటే ఎక్కువ ధర కలిగినదేనని వెల్లడించారు.

దీనిబట్టి ఆయన ఉద్దేశం చౌకైన వస్తువులు కొనడం లేదా కంజూసితనం ప్రదర్శించడం కాదు. కేవలం బ్రాండ్ ఇమేజ్‌ను చూసి సమాజం వేసే అదనపు బాదుడు నుంచి తప్పించుకోవడమే. సాదాసీదాగా కనిపిస్తే అనవసరపు ఖర్చులు అటోమేటిక్‌గా తగ్గిపోతాయనేది ఆయన లాజిక్.

భారతదేశంలో నిజమైన సంపన్నుల మైండ్‌సెట్ ఇదేనా?

భారతదేశంలో నిజంగా ధనవంతులైన వారు తమ సంపదను ఎప్పుడూ ప్రదర్శించరని మీనాంక్ చెప్పుకొచ్చారు. వారు స్టార్‌బక్స్‌ల వంటి ఖరీదైన కాఫీ షాపుల్లో కాకుండా పాతకాలపు సాధారణ కేఫ్‌లలో కూర్చొని కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారని వ్యాఖ్యానించారు. "తక్కువగా ప్రదర్శించండి... ప్రశాంతంగా జీవించండి... అనవసర దృష్టిని ఆకర్షించొద్దు" అంటూ ఆయన నెటిజన్లకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు.. ఎవరి వాదన వారిదే!

ఈ వైరల్ పోస్టుపై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. ఒక వర్గం నెటిజన్లు మీనాంక్ ఆలోచనను పూర్తిగా సమర్థించారు. "ధనవంతుడిలా కనిపించడం కంటే నిజంగా బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండడం ముఖ్యం" "సింప్లిసిటీనే అసలైన ఆయుధం" అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరో వర్గం మాత్రం ఈ లాజిక్‌ను కొట్టిపారేసింది. "మనం సంపాదించేదే మంచి జీవితాన్ని అనుభవించడానికి. ఇతరులు ఏమనుకుంటారో అని భయపడి మనకు నచ్చిన బ్రాండ్లను వదులుకోవాలా?" అని ప్రశ్నించారు. పని అవసరాలకు, క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప ఇలాంటి మైండ్ గేమ్స్ అవసరం లేదని కొందరు వాదించారు.

చివరగా బ్రాండ్స్ , లుక్స్ ఆధారంగా సమాజం మనల్ని జడ్జ్ చేయడం అనేది పచ్చి నిజం. మరి ఈ "లుక్స్ రిచ్ ట్యాక్స్" నుంచి తప్పించుకోవడానికి మీనాంక్ మిన్ను అనుసరించిన వ్యూహం ఇప్పుడు నెట్టింట చర్చ సాగుతోంది.