రోడ్లు మహా దారుణం.. విదేశీయుడి బాధ.. సీఎంకు పారిశ్రామికవేత్త ట్యాగ్
గంటలు గంటలు ట్రాఫిక్ లో పోతున్నందున బెంగళూరు రోడ్లపై సెటైర్లు మామాలుగా ఉండడం లేదు.
By: Tupaki Political Desk | 14 Oct 2025 3:58 PM ISTక్యాబ్ బుక్ చేస్తే క్యాన్సిల్... బైక్ బుక్ చేస్తే క్యాన్సిల్.. సోషల్ మీడియాలో మీమ్స్.. ట్రోల్స్.. సెటైర్లు.. రోజువారీ జీవితంలో ఆఫీస్ కు వచ్చి వెళ్లేందుకే రెండు గంటలు పోతోంది..! -ఇది ట్రాఫిక్ కష్టం.
అధ్వానమైన రోడ్లు.. ఎటుచూసినా గుంతలు.. దుమ్ము-ధూళితో తిప్పలు..!-ఇది రోడ్ల కష్టం..!
ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.. మా ఆఫీసులను తరలించేస్తాం.. -ఇది బహుళజాతి కంపెనీల బాధ
మీ కంపెనీ క్యాంపస్ లో నుంచి రోడ్డు వేస్తాం.. కాస్త పర్మిషన్ ఇవ్వండి-ఓ సంస్థకు ఏకంగా సీఎం వినతి
ఇదంతా భారత సిలికాన్ వ్యాలీగా చెప్పుకొనే బెంగళూరులోని పరిస్థితి. భారత దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రోడ్ల విషయంలో గత బీజేపీ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ సర్కారులోనూ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఇదే విషయం ప్రస్తావిస్తూ ఆ మధ్య ఓ కంపెనీ అధినేత నిట్టూర్చారు. తాజాగా మరో ప్రముఖ మహిళ పారిశ్రామికవేత్త తనతో విదేశీయుడు చెప్పుకొన్న అనుభవాన్ని వివరిస్తూ ఏకంగా కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేశారు.
రోడ్లు దారుణం.. చుట్టూ చెత్త..
బెంగళూరు అంటే పెద్దపెద్ద కార్యాలయాల క్యాంపస్ లు. వీటిలో ఒకటి బయోకాన్. ఈ భారతీయ కంపెనీకి కిరణ్ మంజుదార్ షా అధిపతి. సమర్థురాలైన వ్యాపారవేత్తగా పేరుగాంచిన కిరణ్... సోషల్ మీడియాలోనూ యాక్టివ్. ఇలా తనతో ఇటీవల సమావేశమైన ఓ విదేశీ బిజినెస్ విజిటర్.. బెంగళూరు రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని, చెత్త బాగా పేరుకుందని వాపోయిన విషయాన్ని తెలిపారు. పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వానికి లేదా? చైనా కంటే ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నా.. చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు? అంటూ ప్రశ్నించారని తెలిపారు. ఈ క్రమంలో పరిస్థితిని వివరిస్తూ కిరణ్ మజుందార్ షా.. సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం శివకుమార్ లను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఇలాగైతే వెళ్లిపోతాం.. రమ్మన్న నారా లోకేశ్
గంటలు గంటలు ట్రాఫిక్ లో పోతున్నందున బెంగళూరు రోడ్లపై సెటైర్లు మామాలుగా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల బ్లాక్ బక్ అనే కంపెనీ అధినేత రాజేశ్ యాబాజీ తాము ఇక్కడినుంచి వెళ్లిపోతామంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ కంపెనీని తమ రాష్ట్రానికి రావాలంటూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు.
-ఇటీవల బెంగళూరులోని విప్రో క్యాంపస్ నుంచి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్ జీని సీఎం సిద్ధు కోరారు. దీనికి వీలుకాదని ప్రేమ్ జీ తేల్చిచెప్పారు. ఇప్పుడు కిరణ్ మజుందార్ షా ట్వీట్ కు సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, వచ్చే మార్చినాటికి బెంగళూరు రోడ్ల దశ మార్చేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లో 1,600 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు, పునరుద్ధరణను టార్గెట్ గా చేపట్టింది.
