Begin typing your search above and press return to search.

బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే స్వర్గానికి వెళ్లడం ఈజీ గురూ!

ఒకప్పుడు బెంగళూరు అంటే... చల్లని గాలులు, అందమైన పార్కులు, ఐటీ ఉద్యోగాలు, ఐస్క్రీమ్ పార్లర్లు.

By:  A.N.Kumar   |   17 July 2026 5:14 PM IST
బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే స్వర్గానికి వెళ్లడం ఈజీ గురూ!
X

ఒకప్పుడు బెంగళూరు అంటే... చల్లని గాలులు, అందమైన పార్కులు, ఐటీ ఉద్యోగాలు, ఐస్క్రీమ్ పార్లర్లు. కానీ ఇప్పుడు? అద్దె కట్టలేక అల్లాడిపోవడం.. అడ్వాన్స్ ఇచ్చుకోలేక అప్పులపాలవ్వడం. అవును.. సిలికాన్ వ్యాలీ కాస్తా ఇప్పుడు 'రెంట్ వ్యాలీ'గా మారిపోయింది. సామాన్యుడు బెంగళూరులో అడుగుపెట్టాలంటేనే ప్యాంటు జేబులు గట్టిగా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆకాశంలో అద్దెలు... పాతాళంలో సామాన్యుడి జేబులు

నగరంలో ఇల్లు వెతకడం అనేది ఇప్పుడు ఒక అడ్వెంచర్ స్పోర్ట్. ఎంతలా అంటే పెళ్లి సంబంధాల కంటే ఎక్కువగా ఇంటి ఓనర్లు అద్దెదారుల లింక్డ్‌ఇన్ ప్రొఫైళ్లు, టెన్త్ క్లాస్ మార్కులు, సీటీసీ ప్యాకేజీలు వెరిఫై చేస్తున్నారు. కళ్లముందు కనిపిస్తున్న రేట్లు చూస్తుంటే గుండె గుభేల్మనడం గ్యారెంటీ.. ఒక చిన్న సింగిల్ రూమ్ నెలకు రూ. 30,000.. ఇందులో బెడ్ వేస్తే మనుషులు నిలబడటానికి కూడా చోటుండదు. డబుల్ బెడ్‌రూమ్ 2 బీహెచ్.కే రూ. 40,000 నుంచి రూ. 50,000. అంటే నెలకు వచ్చే జీతంలో సగం ఓనరమ్మ చేతిలో పెట్టాల్సిందే. ఇండిపెండెంట్ విల్లాలు కావాలంటే రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు. ఈ డబ్బుతో సొంత ఊర్లో ఒక ఇల్లే కొనేయొచ్చు..

అడ్వాన్స్ భారం.. కిడ్నీలు అమ్ముకోవాల్సిందేనా?

అద్దె ఒక ఎత్తయితే "సెక్యూరిటీ డిపాజిట్" మరో ఎత్తు. ప్రభుత్వం ఏమో "మూడు నెలల అద్దె కంటే ఎక్కువ తీసుకోకూడదు" అని రూల్స్ రాసి పుస్తకాల్లో దాచేసింది. కానీ ఓనర్లు మాత్రం "10 నెలల అడ్వాన్స్ కట్టాల్సిందే" అని భీష్మించుకు కూర్చుంటారు. "నెలకు రూ. 20 వేల అద్దె ఉన్న ఇంటికి రూ. 2 లక్షల అడ్వాన్స్ అడుగుతున్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే కుర్రాడు అంత బడ్జెట్ తేవాలంటే... కిడ్నీలు ఏమైనా తాకట్టు పెట్టాలా?" అని ఐటీ యువత వాపోతోంది. "నచ్చితే ఉండు.. లేదంటే గేట్ దాటిపో" అనే ఓనర్ల డైలాగులు చూస్తుంటే... అద్దెకు ఉండేవాడు మనుషుడు కాదు.. కేవలం ఒక ఏటీఎం మిషన్ మాత్రమే అనిపిస్తోంది.

ప్రభుత్వానికి వినతులు... సామాన్యుడి ఆశలు

పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఆర్టీఐ వర్కర్స్ సేవా సమితి అధ్యక్షుడు విజయ్ డెన్నిస్ ఏకంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు వినతిపత్రం సమర్పించాల్సి వచ్చింది. "అయ్యా! ఓనర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయండి. ఒక ఆన్‌లైన్ పోర్టల్ పెట్టి ఈ అక్రమ వసూళ్లను ఆపండి" అని మొరపెట్టుకున్నారు.

నిజమే మరి.. ఐటీ హబ్‌లైన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, కోరమంగళ, వైట్‌ఫీల్డ్‌లలో తిరిగే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్యాకేజీలు లక్షల్లో తీసుకుంటున్నా... నెల చివరకు వచ్చేసరికి "అద్దె పోను మిగిలింది టీ తాగడానికి మాత్రమే" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

‘స్టార్టప్’ దేశంలో ‘రెంట్ అప్’ గోల!

స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన బెంగళూరులో ఇప్పుడు "ఇల్లు ఎలా అద్దెకు తీసుకోవాలి?" అనే దానిపై ఒక కొత్త స్టార్టప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వం ఈ 'రెంట్ మాఫియా'పై చర్యలు తీసుకుంటుందో లేదో కానీ అప్పటివరకు సామాన్యులు మాత్రం బెంగళూరు అందాలను చూడటానికి డబుల్ డెక్కర్ బస్సు ఎక్కినా... మనసులో మాత్రం "అద్దె భారం" గుబులు రేపుతూనే ఉంటుంది.