Begin typing your search above and press return to search.

బెంగళూరు సెలబ్రేషన్స్.. మద్యం మత్తులో యువతుల రచ్చ

న్యూ ఇయర్ అంటే యూత్ కు పండుగే.. నిన్న 31 డిసెంబర్ రాత్రి పార్టీలు, పబ్బులు, విందులు వినోదాల్లో మునిగిపోయారు.

By:  A.N.Kumar   |   1 Jan 2026 1:36 PM IST
బెంగళూరు సెలబ్రేషన్స్.. మద్యం మత్తులో యువతుల రచ్చ
X

న్యూ ఇయర్ అంటే యూత్ కు పండుగే.. నిన్న 31 డిసెంబర్ రాత్రి పార్టీలు, పబ్బులు, విందులు వినోదాల్లో మునిగిపోయారు. మందు విందుతో ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ హ్యాంగోవర్ కూడా దిగలేదు. అయితే ఐటీ సిటీ బెంగళూరులో మాత్రం తాగి యువతులు చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. వారి రచ్చ రంబోలాకు పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ ఐటీ సిటీ బెంగళూరు మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోయింది. అయితే ఈ వేడుకల వెనుక మద్యం మత్తులో కొందరు చేసిన హంగామా నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పబ్ లు, రోడ్లపై యువతీ యువకులు హద్దులు దాటి ప్రవర్తించడంతో సిలికాన్ వ్యాలీ వీధులు కాస్తా గొడవలకు నిలయంగా మారాయి.

ఒపెరా రోడ్డులో ‘ప్రియుడి’పై ప్రియురాలి దాడి

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఒపెరా రోడ్డులో ఒక వింత పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి తన ప్రియుడితో గొడవకు దిగడమే కాకుండా.. బహిరంగంగానే అతనిపై దాడికి పాల్పడింది. వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన స్థానికులు, వాహనదారులపై కూడా ఆమె విచక్షణారహితంగా విరుచుకుపడింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. సదరు యువతిని అతికష్టం మీద శాంతింపజేసి అక్కడి నుండి తరలించారు.

కోరమంగళ పబ్ లో ముష్టియుద్ధం

యూత్ అడ్డాగా పేరున్న కోరమంగళ ప్రాంతంలోని ఓ పబ్ లో మద్యం మత్తులో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. చిన్న మాట పట్టింపు కాస్తా పెద్ద గొడవకు దారితీయడంతో ఇద్దరూ పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. పబ్ లోపల ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అవ్వడంతో భయపడిన ఇతర కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్ లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పటాకుల రచ్చ.. తప్పని లాఠీఛార్జ్

మరోవైపు కొందరు యువకులు మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బంది కలిగేలా పటాకులు కాల్చుతూ రచ్చ చేశారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకపోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసుల దెబ్బకు రచ్చ చేస్తున్న గుంపు చెల్లాచెదురైపోయింది.

మత్తులో యువతి.. ఆటోలో పంపిన ఖాకీలు..

మరో ప్రాంతంలో పూర్తిగా మద్యం సేవించి సృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఓ యువతిని చూసిన మహిళా పోలీసులు.. ఆమె భద్రత దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆమెను సురక్షితంగా ఆటోలో ఎక్కించి ఇంటికి పంపించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

పోలీసుల హెచ్చరిక

న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా బెంగళూరు పోలీసులు నగరం అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలపై స్పందించిన ఉన్నతాధికారులు.. "వేడుకలు జరుపుకోవడం తప్పు కాదు.. కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. హద్దులు దాటి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.మొత్తానికి బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు ఒకవైపు ఆనందంగా సాగినా, మరోవైపు ఈ మద్యం గొడవలు కలకలం రేపాయి.