ప్రేమ పేరుతో హత్య.. బెంగళూరులో యువకుడి సజీవ దహనం.. క్రూరత్వానికి కారణం పట్టించుకోవడం లేదనేనా..?
ప్రేమ పేరుతో ఒక యువతి ఇంతటి పాశవిక చర్యకు పాల్పడడం వింటుంటూనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
By: Tupaki Political Desk | 22 April 2026 12:34 PM ISTప్రేమ పేరుతో ఒక యువతి ఇంతటి పాశవిక చర్యకు పాల్పడడం వింటుంటూనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. నమ్మించి పిలిచి, కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ దృశ్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేయడం ఒక మనిషిలోని క్రూరత్వానికి పరాకాష్ట. బెంగళూరులోని అంజనపురాలో జరిగిన ఈ దారుణ ఘటన విని దేశం ఉలిక్కిపడింది. బెంగళూరు నగరంలో ఏప్రిల్ 20, 2026న జరిగిన ఒక దారుణ హత్య ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ, పెళ్లి ప్రతిపాదన వంటి తీయటి మాటలలు చెప్పి నమ్మించి, తన ప్రియుడిని ఇంటికి పిలిచిన యువతి, అతడిని సజీవ దహనం చేయడం సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా ప్రేమికుల మధ్య గొడవలు రావడం సహజం, కానీ ఒక ఏడాది పాటు తనను నిర్లక్ష్యం చేశాడనే కోపంతో ఇంతటి పక్కా ప్లాన్‌తో ప్రాణాలు తీయడం అత్యంత భయానకమైన విషయం.
హత్య చేసిందిలా..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితురాలు తన ప్రియుడిని ఇంటికి ఆహ్వానించింది. తాను ఒక ప్రత్యేకమైన ‘వెస్ట్రన్ స్టైల్’ వెడ్డింగ్ ప్రపోజల్ ప్లాన్ చేశానని, అందులో భాగంగా కళ్లకు గంతలు కట్టుకోవాలని కిరణ్‌ను ఒప్పించింది. ఆమె మాటలు నమ్మిన కిరణ్, ఏదో సర్ప్రైజ్ ఉంటుందని ఆశించాడు. కానీ ఆమె అతడి చేతులు, కాళ్లను కుర్చీకి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి నిస్సహాయుడిని చేసింది.
సజీవ దహనం.. వీడియో రికార్డింగ్!
పరిస్థితి ఎప్పుడు హింసాత్మకంగా మారుతుందో కిరణ్ ఊహించలేకపోయాడు. కిరణ్ బంధీగా ఉన్న సమయంలోనే ఆమె అతనిపై ఇంధనం (పెట్రోల్/డీజిల్) పోసి నిప్పంటించింది. ఆ మంటల్లో కిరణ్ ఆహుతి అవుతుంటే, ఆమె చలించకుండా ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసింది. సాయం కోసం అతను చేసిన హాహాకారాలు ఆ గదిలోనే కలిసిపోయాయి. చివరికి కిరణ్ అక్కడికక్కడే మరణించాడు.
విస్మరించినందుకే..
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది కాలంగా కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, సరిగ్గా మాట్లాడడం లేదని నిందితురాలు మనస్తాపానికి గురైంది. తనను కాదని వేరొకరితో ఉంటున్నాడనే అనుమానం లేదంటే తనను వదిలేస్తాడనే భయం ఆమెను ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించి ఉండవచ్చు. ఇది కేవలం కోపం కాదు, ఒక రకమైన ‘సైకోపాథిక్’ ప్రవర్తన అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వీడియో సాక్ష్యమే కీలకం!
ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. హత్యను రికార్డ్ చేసిన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోనే నిందితురాలికి శిక్ష పడడంలో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారబోతోంది. ఆమెపై హత్య, ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన సంబంధాలలోని విషపూరిత ధోరణిని ఎత్తిచూపుతోంది. భాగస్వామి నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపించినప్పుడు విడిపోవడం లేదంటే పెద్దల సమక్షంలో మాట్లాడడం సరైన నిర్ణయం. కానీ హింసను ఎంచుకోవడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. విపరీతమైన ఆవేశం, పగ తీర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం అత్యవసరం.
ప్రేమలో నమ్మకం ఉన్నచోట భయం ఉండకూడదు. కానీ ఇక్కడ నమ్మకాన్నే ఆయుధంగా చేసుకుని ప్రాణాలు తీయడం అత్యంత దారుణం. సదరు వ్యక్తి మరణం ఒక కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం లేదంటే పగ కోసం ఇలాంటి హింసాత్మక వీడియోలు తీయడం వికృత చేష్ట. చట్టం ఆమెకు కఠిన శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
