ఇదేం కూతురు? మంచి మాటలు చెప్పిందని తల్లిని చంపేసింది
తెలిసి తెలియని వయసులో చేసే తప్పుల్ని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవటం మామూలే.
By: Garuda Media | 1 Nov 2025 9:52 AM ISTతెలిసి తెలియని వయసులో చేసే తప్పుల్ని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవటం మామూలే. అయితే.. ఇదే ఒక తల్లికి శాపంగా మారటమే కాదు.. ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన తాజాగా చోటు చేసుకుంది. సంచలన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న కర్ణాటకలోనే తాజా ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం. మైనర్ బాలిక ప్రవర్తన లోపాల్ని సరిదిద్దే క్రమంలో మందలించిన తల్లి తీరును తట్టుకోలేని కుమార్తె దారుణంగా వ్యవహరిస్తూ.. స్నేహితులతో కలిసి చంపేయటం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరపరిధిలోని సుబ్రహ్మణ్యపుర పోలీసు స్టేషన్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పదిహేనేళ్ల కుమార్తె కట్టుతప్పి ప్రవర్తిస్తున్న వైనాన్ని గుర్తించిన తల్లి కుమార్తెను తీవ్రంగా మందలించింది. దీంతో.. తల్లిపై పగ పెంచుకున్న ఆ బాలిక.. అక్టోబరు 25న తన నలుగురు స్నేహితుల్ని ఇంటికి పిలిపించుకుంది. ఈ నలుగురు కూడా మైనర్లు కావటం గమనార్హం.
తల్లి నిద్ర పోతున్న వేళలో.. ఇంటికి వచ్చిన నలుగురు స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్న కూతురి తీరుతో ఆమెకు మెలుకువ వచ్చింది. విపరీతమైన నవ్వులతో డిస్ట్రబ్ అయిన ఆమె.. కుమార్తె గదిలోకి వెళ్లి చూడగా షాక్ తింది. ఎందుకంటే.. నలుగురు అబ్బాయిలతో కలిసి తన కుమార్తె అభ్యంతరకర స్థితిలో ఉన్న వైనాన్ని గుర్తించి.. గట్టిగా మందలించింది. అప్పటికే వారు ప్లాన్ చేసుకొని.. ప్రిపేర్ అయిన నేపథ్యంలో వారంతా ఆమెను చుట్టుముట్టి.. నోటిని మూసి.. గొంతుకు తువాలు బిగించి మర్డర చేశారు.
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వీలుగా డెడ్ బాడీని చీరతో ఫ్యాన్ కు వేలాడదీసి.. అక్కడి నుంచి వారంతా పారిపోయారు. తర్వాతి రోజు ఇంటికి వచ్చిన బాధితురాలి సోదరి.. ఫ్యాన్ కు వేలాడుతున్న ఆమెను చూసి.. ఇరుగుపొరుగు వారి సాయంతో బయటకు తీశారు. అంత్యక్రియలకు కుమార్తె హాజరు కాకపోవటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న వారు విచారణలో వారు తాము చేసి దారుణ ఘటన గురించి చెప్పటంతో షాక్ తినటం పోలీసుల వంతైనట్లుగా తెలుస్తోంది. బాలికతో సహా నలుగురు బాలల్ని రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
