స్థలం ఎక్కడా దొరకలేదా నాయనా.. ఫ్లైఓవర్ స్తంభంలో పడుకున్నావ్? వైరల్ వీడియో
ఈ వైరల్ వీడియోలో ఆ వ్యక్తి స్తంభం అడుగు భాగంలో ఉన్న చిన్న గుహలాంటి సన్నని గుంటలో మడుచుకుని పడుకుని ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.
By: A.N.Kumar | 13 Nov 2025 9:59 AM ISTకర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల చోటుచేసుకున్న ఒక విచిత్రమైన సంఘటన నగరవాసులను, సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. జలహళ్లి క్రాస్ వద్ద ఉన్న ఒక ఫ్లైఓవర్ స్తంభం (పిల్లర్) మధ్యలో ఉన్న గుండ్రటి ఖాళీ ప్రదేశంలో ఒక వ్యక్తి హాయిగా నిద్రిస్తున్న దృశ్యం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.
*ఎలా చేరాడనేదే ప్రశ్న!
ఈ వైరల్ వీడియోలో ఆ వ్యక్తి స్తంభం అడుగు భాగంలో ఉన్న చిన్న గుహలాంటి సన్నని గుంటలో మడుచుకుని పడుకుని ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు, పాదచారులు ఆ వ్యక్తిని చూసి వెంటనే ఆగిపోయారు. "అతను అంత చిన్న, ప్రమాదకరమైన చోటులోకి ఎలా చేరాడు?" అనే ప్రశ్న అందరి మనసుల్లో మెదులుతోంది. ఈ వింత దృశ్యం కారణంగా అక్కడ చిన్నపాటి జన సమూహం ఏర్పడింది. కొందరు ఈ ఘటన నగరంలోని నిరాశ్రయుల దుర్భర పరిస్థితికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు, నిద్రించడానికి వేరే చోటు లేక అతను అక్కడ తలదాచుకుని ఉంటాడని అన్నారు. మరికొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన ఏదైనా స్టంట్ అయ్యి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.
*సోషల్ మీడియాలో కలకలం
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే వేలాది వ్యూస్‌ను, వందలాది లైకులను, కామెంట్లను సంపాదించింది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. "ఆ స్తంభం పైభాగానికి అతను ఎలా చేరాడు? ఏదైనా తప్పుడు ఉద్దేశంతో అక్కడ ఉంటే ప్రమాదకరం" అంటూ భద్రతా లోపాలపై కొందరు ప్రశ్నించారు.
* పోలీసుల స్పందన
ఈ ఘటనపై బెంగళూరు పోలీసులకు దృష్టికి వచ్చింది. వారు వెంటనే స్పందించి, ఈ విషయంపై తగిన విచారణ చేపట్టాలని పీన్యా పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఆ వ్యక్తి వివరాలు అతను అక్కడకు చేరడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.
ఈ విచిత్రమైన సంఘటన బెంగళూరులో ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నగర భద్రత, నిరాశ్రయుల సమస్య, పౌర నిర్మాణాల నిర్వహణపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి నిలిచింది.
