ఫైవ్ స్టార్ హోటళ్ల మీరు తినేది ఎక్స్‌పైర్డ్ ఫుడ్.. షాకింగ్ నిజాలివీ
ఈ రోజుల్లో లగ్జరీ అంటే కేవలం అందమైన అలంకరణ, ఖరీదైన అనుభూతి మాత్రమే కాదు.. అంతకుమించి నాణ్యమైన ఆహారం.. మెరుగైన ఆరోగ్యం అని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు.
By: A.N.Kumar | 8 Aug 2026 11:31 PM ISTఈ రోజుల్లో లగ్జరీ అంటే కేవలం అందమైన అలంకరణ, ఖరీదైన అనుభూతి మాత్రమే కాదు.. అంతకుమించి నాణ్యమైన ఆహారం.. మెరుగైన ఆరోగ్యం అని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. సాధారణ రెస్టారెంట్లతో పోలిస్తే వేలకు వేలు వెచ్చించి ఫైవ్ స్టార్, త్రీ స్టార్ లగ్జరీ హోటళ్లకు వెళ్లేది కూడా అందుకే. ఎంత ఎక్కువ ధర చెల్లిస్తే అంతటి నాణ్యత, అత్యుత్తమ పరిశుభ్రత లభిస్తాయని సగటు వినియోగదారులు బలంగా నమ్ముతారు. అయితే "ధర ఎక్కువ ఉంటే భద్రత గ్యారంటీ" అనుకునే కస్టమర్ల నమ్మకానికి బెంగళూరులో ఇటీవల జరిగిన ఆహార భద్రతా తనిఖీలు పెద్ద షాక్ ఇచ్చాయి.
బెంగళూరు నగరంలోని సుమారు ఇరవై ఆరు ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ లగ్జరీ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దిగ్గజ హోటళ్లలో అధికారులు జరిపిన సోదాల్లో వెలుగు చూసిన వాస్తవాలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
ఈ సోదాల్లో అధికారులు ఊహించని రీతిలో భారీ మొత్తంలో గడువు ముగిసిన మాంసం, చేపలు, పాలు, కూరగాయలు , బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఓ హోటల్‌లో అత్యధికంగా డెబ్బై ఆరు కిలోల మాంసం, రెండు వందల కిలోల నిల్వ కూరగాయలు, ముప్పై రెండు లీటర్ల గడువు ముగిసిన పాలను గుర్తించారు. అలాగే మరో ప్రముఖ హోటల్ లో ఏకంగా నూట ఐదు కిలోల ఎక్స్‌పైర్డ్ చికెన్, మాంసం, చేపలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మరో హోటల్ లో డెబ్బై రెండు కిలోలు, ఫోర్ సీజన్స్‌లో పంతొమ్మిది కిలోలు, షాంగ్రి-లాలో పదిహేను కిలోల నాణ్యత లేని మాంసం లభ్యమవ్వగా, ఇంకో హోటల్ లో గడువు ముగిసిన బేకరీ పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.
కేవలం గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడమే కాకుండా ఈ లగ్జరీ హోటళ్ల వంటగదుల్లో కనీస పరిశుభ్రత లోపించడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఆహార పదార్థాలపై ఫంగస్ పట్టడం, వంట సరుకులను ఉండాల్సిన సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోవడం, ప్యాకెట్లపై సరైన లేబులింగ్ లేదా ఎక్స్‌పైరీ తేదీలు లేకపోవడం వంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. అధికారులు అక్కడ లభించిన ఆహార నమూనాలను సేకరించి తదుపరి విశ్లేషణ కోసం ప్రయోగశాలలకు పంపించారు. నిబంధనలు అతిక్రమించిన సదరు హోటళ్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని.. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
వీధి చివర ఉండే చిన్న చిన్న హోటళ్లలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న బ్రాండ్ లగ్జరీ హోటళ్లలో కూడా ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారడం నిజంగా విచారకరం. అధిక ధరలు చెల్లిస్తున్నంత మాత్రాన అక్కడ లభించే ఆహారం అత్యంత సురక్షితమైనదని గుడ్డిగా నమ్మలేమని ఈ బెంగళూరు ఘటన స్పష్టం చేస్తోంది. ఆహార భద్రత అనేది హోటల్ పరిమాణంపై గానీ అక్కడ వసూలు చేసే ధరపై గానీ ఆధారపడకూడదు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్ట్యా అధికారులు ఇలాంటి తనిఖీలను నిరంతరం నిర్వహిస్తూ కస్టమర్ల ఆరోగ్యంతో ఆడుకునే లగ్జరీ హోటళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
