ఫైవ్‌స్టార్ హోటల్.. స్విమ్మింగ్ పూల్‌లో మృత్యుఘోష.. ఇద్దరు విదేశీయులు బలి..
శుక్రవారం సాయంత్రం హోటల్ మూడో అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌లో కొందరు అతిథులు ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం నీటిలోకి లీకైంది.
By: A.N.Kumar | 31 Oct 2026 5:23 PM ISTలగ్జరీ హోటల్.. అత్యాధునిక సౌకర్యాలు.. ఒక్క రోజుకు రూ.25 వేలకు పైగా గది అద్దె. కానీ అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం ఇస్తామని చెప్పే ఆ ఫైవ్‌స్టార్ హోటల్లో అతిథుల ప్రాణాలకు కనీస భద్రత కరువైంది. బెంగళూరులోని ఓ ప్రముఖ 24 అంతస్తుల లగ్జరీ హోటల్లో జరిగిన ఘోర ప్రమాదం విదేశీ అతిథుల ప్రాణాలను బలిగొనడమే కాకుండా.. దేశంలోని ఆతిథ్య రంగంలో భద్రతా ప్రమాణాలపై అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
శుక్రవారం సాయంత్రం హోటల్ మూడో అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌లో కొందరు అతిథులు ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం నీటిలోకి లీకైంది. దీంతో పూల్‌లో ఉన్నవారు తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ దుర్ఘటనలో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థిస్ (57), స్లోవేకియాకు చెందిన ఐబీఎమ్ ప్రాజెక్ట్ మేనేజర్ యురాజ్ హోర్వాత్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరోవైపు పూల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమెరికాకు చెందిన మ్యాథ్యూ డిసాంటిస్ (41) అనే అతిథితో పాటు హోటల్ అటెండెంట్ రాహుల్ తివారీ (28) ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ క్రమంలో వారిద్దరూ కూడా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని మణిపాల్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదం జరిగిన తీరు కంటే దాని తర్వాత హోటల్ యాజమాన్యం వ్యవహరించిన తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదంపై అధికారికంగా స్పందించని యాజమాన్యం, శనివారం ఉదయం తమ వెబ్సైట్లో 'నిర్వహణ పనుల నిమిత్తం' అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు పూల్‌ను మూసివేస్తున్నట్లు ఒక నోటీసు ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విద్యుత్ లీకేజీని అడ్డుకోవడంలో ఎర్తింగ్, సర్క్యూట్ బ్రేకర్లు వంటి కనీస భద్రతా వ్యవస్థలు ఎందుకు పనిచేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యంపై దర్యాప్తు వేగవంతం చేశారు. విశ్రాంతి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన.. కేవలం ఒక హోటల్ వైఫల్యాన్ని సూచిస్తోంది. లగ్జరీ రిసార్టులు, హోటళ్లలో భద్రతా తనిఖీల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.
