షాకింగ్... జైలేనా ఈ రేపిస్టు, నేరస్తులకు స్వర్గసీమ..!
ఖైదీల్లో పరివర్తన తీసుకురావడం కోసమే జైల్లు అని అంటారు.. తాము చేసిన తప్పుకు వారిలో పశ్చాత్తాపం కలగాలని కోరుకుంటారు.
By: Raja Ch | 8 Nov 2025 8:49 PM ISTఖైదీల్లో పరివర్తన తీసుకురావడం కోసమే జైల్లు అని అంటారు.. తాము చేసిన తప్పుకు వారిలో పశ్చాత్తాపం కలగాలని కోరుకుంటారు. శిక్షపుర్తైన తర్వాత బయటకు వెళ్లి ఉత్తమ పౌరులుగా జీవించాలని భావిస్తారు. ఈ క్రమంలో జైల్లో పూర్తి క్రమశిక్షణను అలవాటు చేస్తారు అధికారులు.. బయట సమాజంలో దొరికే కొన్ని సుఖాలకు, సౌకర్యాలకు దూరం పెడతారు!
ఇందులో భాగంగా సెల్ ఫోన్లు, మత్తు పదార్ధాలకు దూరంగా ఉంచుతారు. కుటుంబ సభ్యులను, అయినవారిని కలవడానికి ములాఖత్ సౌకార్యాన్ని నిబంధలన ప్రకారం కల్పిస్తారు. సహజంగా అన్ని జైల్లలోనూ దాదాపుగా జరిగేది ఇదే! కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జైల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా.. బెంగళూరులోని ఓ జైల్లో మాత్రం పరిస్థితులు నిబంధనలు భిన్నంగా ఉన్నాయని.. అక్కడ రేపిస్టులు, నేరస్థులు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని.. వారు సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారని.. టీవీ చూస్తున్నారని.. వారి వారి బ్యారక్స్ లో ప్రత్యేకంగా వంట చేసుకుంటున్నారనే ఆరోపణలతో వీడియోలు వెలుగులోకి వచ్చాయి! ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అవును... బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడు తరుణ్ రాజు, పలువురు ఇతర ఖైదీలు.. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్లు.. ఇతర అధికారాలను, సౌకర్యాలను అనుభవిస్తున్నట్లు చూపించే వీడియోలు వెలుగులోకి వచ్చాయి! దీంతో... బెంగళూరులోని అధికారులు దర్యాప్తు దీనిపై ప్రారంభించారు.
నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియోల్లో... 1996 - 2022 సంవత్సరాల మధ్య జరిగిన లైంగిక వేధింపులు, హత్యల కేసుల్లో దోషిగా తేలిన రేపిస్ట్ ఉమేష్ రెడ్డి తన బ్యారక్ లో పలు మొబైల్ ఫోన్ లను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్న పరిస్థితి! దీంతో... నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు! ఇదే క్రమంలో ఆ ఫుటేజ్ లో ఓ టెలివిజన్ కూడా కనిపిస్తుంది!
మాజీ పోలీస్ కానిస్టేబుల్ అయిన ఉమేష్ రెడ్డి.. సుమారు 18 హత్యలు, 20 అత్యాచారలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. అతని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత.. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్య నివేదికలు వెళ్లడించిన నేపథ్యంలో... సుప్రీంకోర్టు అతనికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఇదే క్రమంలో బయటకు వచ్చిన మరో వీడియోలో... బంగారు స్మగ్లింగ్ కేసులో నిందితుడైన తరుణ్ రాజు.. జైలు ఆవరణలో మొబైల్ ఫోన్ వాడుతూ, ఆహారం వండుకుంటున్నట్లు కూడా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో... ఈ ఖైదీలు నిషేధిత పరికరాలను జైలు లోపల ఎలా పొందారు అనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది! దీనిపై విచారణ జరుగుతోందని జైలు శాఖ ధృవీకరించింది.
