రూ.1.3 లక్షలు ఖర్చు చేస్తున్నా… బెంగళూరులో మేమింకా పేదలమే అనిపిస్తోంది
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జీవన ప్రమాణాలు పెరిగేకొద్దీ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం సర్వసాధారణమైపోయింది.
By: A.N.Kumar | 12 May 2026 12:00 AM ISTబెంగళూరు వంటి మెట్రో నగరాల్లో జీవన ప్రమాణాలు పెరిగేకొద్దీ సామాన్యుడి జేబుకు చిల్లు పడటం సర్వసాధారణమైపోయింది. అయితే, తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ జంట సోషల్ మీడియాలో పంచుకున్న తమ ఖర్చుల వివరాలు ఇప్పుడు ఐటీ కారిడార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నెలకు రూ.1.3 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ.. తాము ఇంకా "పేదరికంలోనే" ఉన్నామేమో అన్న భావన కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఉదంతం బెంగళూరులోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లకు అద్దం పడుతోంది.
బెంగళూరులో 'లక్ష' దాటుతున్న ఖర్చులు.. ఐటీ జంట ఆవేదన
దేశ ఐటీ రాజధానిగా పిలవబడే బెంగళూరులో ఉద్యోగం దొరికితే జీవితం సెటిల్ అయిపోయినట్టే అని అందరూ భావిస్తారు. కానీ ఆ జీతాలు పెరిగే కొద్దీ ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతున్నాయని ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో పనిచేస్తున్న ఒక యువ దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నెలకు ఒకటిన్నర లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతున్నా.. భవిష్యత్తు కోసం పైసా పొదుపు చేయలేకపోతున్నామని వారు వాపోయారు.
అద్దెల మోత.. సగానికి పైగా ఖర్చు అక్కడే!
ఈ దంపతులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వారి ఖర్చుల్లో సింహభాగం ఇంటి అద్దెకే వెళ్తోంది. బెంగళూరులోని ప్రధాన ఐటీ హబ్‌లకు సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నందుకు వారు నెలకు రూ. 56,000 అద్దెగా చెల్లిస్తున్నారు. మెయింటెనెన్స్ , ఇతరాలు రూ. 5,000 - 8,000 అవుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఆఫీసులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ అద్దె చెల్లించక తప్పడం లేదని వారు పేర్కొన్నారు.
సాధారణ జీవితమే.. కానీ ఖరీదైనది!
వారి ఖర్చుల జాబితాను నిశితంగా గమనిస్తే అందులో ఎక్కడా విలాసవంతమైన విహారయాత్రలు గానీ ఖరీదైన బ్రాండెడ్ షాపింగ్‌లు గానీ లేవు. అన్నీ నిత్యావసరాలే కావడం ఇక్కడ విశేషం. ఇద్దరూ ఫుల్ టైమ్ ఉద్యోగాల్లో బిజీగా ఉండటం వల్ల ఇంటి పనుల కోసం సహాయకులను పెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి నెలకు రూ. 15,000 - 20,000 వరకు ఖర్చవుతోంది. బయట నుంచి ఆర్డర్ చేసే ఆహారం, నెలవారీ కిరాణా సరుకులకు మరో రూ. 25,000 వరకు వెచ్చిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు, విద్యుత్ బిల్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్, వివిధ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అన్నీ కలిపి నెలాఖరుకు ఖర్చును రూ.1.3 లక్షల మార్కుకు చేరుస్తున్నాయి.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
మెట్రో నగరాల్లో సౌకర్యవంతంగా బతకాలంటే ఈ మాత్రం ఖర్చు తప్పదని, ముఖ్యంగా బెంగళూరులో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయని వారు మద్దతు తెలుపుతున్నారు. సమయాన్ని ఆదా చేసుకోవడానికి వంట మనుషులను, ఆన్‌లైన్ సేవలను ఆశ్రయించడం విలాసం కాదు.. అవసరమని వారు వాదిస్తున్నారు. రూ. 1.3 లక్షలు ఖర్చు చేస్తూ కూడా పేదవాళ్లమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కొందరు మండిపడుతున్నారు. ఇది కేవలం జీవనశైలి వల్ల పెరిగిన ఖర్చు అని, అద్దె తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉండటం ద్వారా లేదా అనవసరపు ఆర్డర్లను తగ్గించడం ద్వారా పొదుపు చేయవచ్చని సూచిస్తున్నారు.
ఈ చర్చ ఎలా ఉన్నా బెంగళూరు వంటి నగరాల్లో మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయన్నది వాస్తవం. కేవలం నిత్యావసరాలకే లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. పెరిగిన జీతాలు కేవలం పెరిగిన అద్దెలకు, సేవా ఛార్జీలకే సరిపోతుంటే "ఆర్ధిక భద్రత" అనేది కేవలం కలగానే మిగిలిపోతుందా అనే ఆందోళన ఐటీ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
