Begin typing your search above and press return to search.

లక్ష 80 వేలు జీతం...సొంతిల్లు పెద్ద కల

నిజంగా ఇదే వార్త. ఎందుకంటే దాదాపుగా నెలకు రెండు లక్షల జీతం. ఏడాదికి పాతిక లక్షలుగా వేసుకోవచ్చు.

By:  Satya P   |   27 Sept 2026 9:24 AM IST
లక్ష 80 వేలు జీతం...సొంతిల్లు పెద్ద కల
X

నిజంగా ఇదే వార్త. ఎందుకంటే దాదాపుగా నెలకు రెండు లక్షల జీతం. ఏడాదికి పాతిక లక్షలుగా వేసుకోవచ్చు. కానీ సొంత ఇంటి కల తీరడం లేదు అంటే ఇది అతి పెద్ద తమాషాగానే చూడాలి. అయితే ఇది ఒక టెకీ ఆవేదనగా ఉంది. తనకు మంచి జీతం ఉంది, పొదుపుగా ఉంటాను, కానీ సొంతిల్లు మాత్రం తీరని కలగా మిగిలింది అని బెంగళూరులో పని చేస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకంగా కోటీ ముప్పై లక్షల రూపాయల బడ్జెట్ పెట్టాలని చూసినా అతి చిన్న ఇరుకైన ప్లాట్లే వస్తున్నాయని సదరు టెకీ వాపోతున్నాడు. ఆ టెకీ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు చూసిన వారికి సొంతిళ్ళు అలాంటి పది అంకెల టెకీకే సాధ్యం కాకపోతే సామాన్యుడి సంగతేంటని ప్రశ్నలు వేసుకుంటున్నారు.

ఇంటి బెంగళూరు :

బెంగళూరు దేశంలో అతి పెద్ద మెట్రో సిటీ. అంతే కాదు సంపన్న వర్గాల సిటీ. అక్కడ ప్లాట్ అద్దెకు తీసుకోవాలంటేనే వేలు పోయాల్సి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో టాప్ గేర్ వేస్తుంది. ఇక సొంత ఇల్లు అంటే ఆకాశం వైపు చూడాల్సిందే. ఎందుకంటే రేట్లు అక్కడికి ఎగబాకుతున్నాయి. ఒక వైపు పెరిగిపోతున్న డిమాండ్, మరో వైపు చూస్తే ఎంత సంపాదించినా అంచనాలు అందుకోలేని మిడిల్ క్లాస్ ఉద్యోగుల వెతలు ఇవన్నీ కలసి బెంగళూరు కాదు అది సొంత ఇంటి బెంగళూరు అని ట్విస్ట్ చేస్తున్నారు. లేకపోతే రెండు లక్షల జీతం వచ్చిన టెకీకి కూడా సొంతింటి కల తీరకపోవడమేంటని ఆలోచిస్తున్నారు.

ఎంతో పొదుపుగా ఉంటూ :

బెంగళూరులో సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడిగా ఉన్న ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితం చూస్తే ఎంతో పొదుపుగా ఉంటాడు. వయసు పాతికేళ్లు. తన జీతంతో మంచి సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశ పడ్డాడు. అందుకోసం ఉద్యోగం వచ్చిన మొదటి రోజు నుంచే పొదుపు మంత్రం పాటిస్తూ పోతున్నాడు. కారు ఉంటే ఖర్చు అని స్కూటర్ నే వాడుకుంటున్నాడు. ప్రస్తుతం పీజీలో నివసిస్తూ నెలకు 31 వేల రూపాయలు మాత్రమే బడ్జెట్ గా వినియోగిస్తూ ఎలాంటి సరదాలు దరి చేరనీయకుండా ప్రతి నెలా సుమారు 75 వేల రూపాయలు సిప్‌ రూపంలో పెట్టుబ‌డి పెడుతున్నాడు. అలాగే మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తున్నాడు. ఇవనీ సదరు టెకీ సొంతింటి కోసం పడుతున్న ఆరాటంగా ఉంది.

అగ్గి పెట్టె ఇళ్ళు :

ఇక తాను పొదుపు చేసిన మొత్తాన్ని చూసుకుని మంచి సొంతిళ్లే దొరుకుతుందని ఆశపడిన టెకీకు బ్రోకర్లు షాక్ ఇచ్చారు. ఆయన తాను ఒక కోటి 30 లక్షల మొత్తాన్ని సొంతింటి కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడితే దాంతో కేవలం అతి సాధారణ అపార్టుమెంట్ లో ఇరుకైన డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ మాత్రమే దక్కుతుందని బ్రోకర్లు చూపించి మరీ టెకీ ఆశలు నీరు కార్చేశారు. ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలతో కూడుకున్న ప్లాట్ల రేట్లు అయితే గేటెడ్ కమ్యూనిటీలో ఏకంగా రెండు కోట్ల రూపాయలు దాటుతున్నాయని అంటున్నారు. కేవలం బెంగళూరులో మాత్రమే కాదు పూణె వంటి నగరాలలో ఇదే రకమైన పరిస్థితి ఉందని అంటున్నారు. దాంతో సొంతిటి కల లక్షల జీతగాళ్లకు కూడా వల్ల కావడం లేదని అంటున్నారు.

ఎన్నేళ్ళు పొదుపు బతుకు :

ఇపుడు ఆ టెకీకి పట్టుకున్న బాధ ఏంటి అంటే ఎన్నేళ్ల పాటు ఇంకా పొదుపు జీవితం గడపాలి అని. ఎందుకంటే కష్టపడి దాచిన సొమ్ము అయితే ఇరుకు ప్లాట్ కే సరిపోతుంది. రెండు కోట్లు బడ్జెట్ పెట్టాలీ అంటే మరో ఐదేళ్ల పాటు ఇదే తీరున పొదుపుగా జీవించాలా అని వాపోతున్నాడు. ఇలా అయితే జీవితం ఏ సరదా లేకుండానే మిగిలిపోతోంది, అప్పటికి ఈ రెండు కోట్ల ప్లాట్లు మూడు కోట్లు పలకవు అన్న గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు. మొత్తం మీద టెకీలకే షాక్ ఇస్తున్న సొంతింటి కలను చూసిన మధ్య తరగతి వర్గాలు తమకు ఇల్లు అన్న ఆలోచన కలలో అయినా ఉండొచ్చా అని మధన పడుతున్నారు. ఎందుకంటే అమాంతం ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి. దానికి తగినట్లుగా బడ్జెట్ అయితే ఎవరి దగ్గరా సమకూరడం లేదు, చిన్న జీవితం పెద్ద బడ్జెట్ కి మధ్య భారీ అంతరాలతో కలలే ఎప్పటికీ గెలుస్తున్నాయని అంటున్నారు.