Begin typing your search above and press return to search.

పన్నుల మోత.. భారత్‌ను వీడుతున్న మరో వ్యాపారవేత్త! కారణం ఇదేనా?

లింక్డ్ ఇన్ లో రోహిత్ ష్రాఫ్ చేసిన సుధీర్ఘ పోస్ట్ వైరల్ గా మారింది. ‘బిల్డింగ్ ఇన్ ఇండియా’ అనే గొప్ప ఆశయంతో మొదలైన తన ప్రయాణం.. వ్యవస్థలోని లోపాల వల్ల అర్ధాంతరంగా ముగిసిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

By:  A.N.Kumar   |   28 Dec 2025 11:04 PM IST
పన్నుల మోత.. భారత్‌ను వీడుతున్న మరో వ్యాపారవేత్త! కారణం ఇదేనా?
X

భారతదేశంలో వ్యాపారం చేయడం రోజురోజుకీ కష్టంగా మారుతోందా? లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నా.. వ్యవస్థల నుంచి గౌరవం కరువవుతోందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు బెంగళూరుకు చెందిన యువ వ్యాపారవేత్త రోహిత్ ష్రాఫ్. బెంగళూరు కేంద్రంగా కంటెంట్ మార్కెటింగ్ సంస్థను విజయవంతంగా నడుపుతున్న ఆయన.. 2026 నాటికి భారతదేశాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బిల్డింగ్ ఇన్ ఇండియా కల చెదిరిపోయింది..

లింక్డ్ ఇన్ లో రోహిత్ ష్రాఫ్ చేసిన సుధీర్ఘ పోస్ట్ వైరల్ గా మారింది. ‘బిల్డింగ్ ఇన్ ఇండియా’ అనే గొప్ప ఆశయంతో మొదలైన తన ప్రయాణం.. వ్యవస్థలోని లోపాల వల్ల అర్ధాంతరంగా ముగిసిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత ఏడాది నేను రూ.4 కోట్ల పన్ను చెల్లించారు. కానీ పన్ను చెల్లింపుదారుడిని గౌరవించాల్సింది పోయి వ్యవస్థ నన్ను ఒక నిందితుడిలా చూస్తోంది. అందుకే భారత్ ను వీడాలని నిర్ణయించుకున్నాను’ అని రోహిత్ ష్రాఫ్ పేర్కొన్నాడు. వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న ప్రధానఇబ్బందులను రోహిత్ తనపోస్టులో ఎండగట్టారు. ‘జీఎస్టీ అధికారులు, ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే నోటీసులకు సమాధానం చెప్పుకోవడమే పెద్ద పనిగా మారిందని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాన్ని వృద్ధిచేయడం కంటే వ్యవస్థతో పోరాడటానికే ఎక్కువ సమయం, డబ్బు ఖర్చవుతోందని విమర్శించారు. నెలవారీ జీఎస్టీ రిటర్నులు, త్రైమాసిక టీడీఎస్ ఫైలింగులు, వార్షిక ఆడిటింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకంగా పెద్ద బృందాలను నియమించుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించే కొద్దిమందిపై భారం వేస్తూ ఆ సొమ్మును ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉచితాలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.

పెరుగుతున్న ‘మేధో వలస’

కేవలం రోహిత్ మాత్రమే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది సంపన్న వ్యాపారవేత్తలు.. స్టార్టప్ వ్యవస్థాపకులు భారత్ ను వీడి దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలిపోతున్నారు. పన్ను విధానాల్లో స్పష్టత.. వ్యాపార స్నేహపూర్వక వాతావరణం ఉన్నదేశాల వైపు వారు మొగ్గు చూపుతున్నారు.

మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నెరవేరేనా?

ఒకవైపు కేంద్రప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా , స్టార్టప్ ఇండియా అంటూ పిలుపునిస్తుంటే... క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజాయితీగా పన్నులు కట్టే వారికి ప్రోత్సాహం లభించకపోతే భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులు దేశాన్ని వీడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రోహిత్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వ పన్ను విధానాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. మరి ఈ బ్రెయిన్ డ్రైన్ ను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.