'దయచేసి గౌరవించండి'... డెలివరీ బాయ్ ఆవేదన వీడియో వైరల్!
అవును... బెంగళూరులో ఆర్డర్ డెలివరీ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ డెలివరీ ఏంజెంట్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By: Raja Ch | 23 Dec 2025 2:00 PM ISTబెంగళూరులో ఆర్డర్ డెలివరీ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ డెలివరీ ఏజెంట్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇదే సమయంలో.. ఇది ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. బైక్ ని రెసిడెన్షియల్ ఏరియాలోకి సెకూరిటీ అనుమతించకపోవడంతో.. ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి వందల మీటర్లు నడిచిన అనుభవాన్ని చూపిస్తూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇది వైరల్ గా మారింది.
అవును... బెంగళూరులో ఆర్డర్ డెలివరీ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ డెలివరీ ఏంజెంట్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో అర్జున్ సేథి అనే డెలివరి ఏజెంట్.. ఒక ఇంటి గుమ్మం వద్ద ఆర్డర్ ను అందజేస్తున్నప్పటి నుంచి వీడియోను రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో, డెలివరీ ఏజెంట్ ఆర్డర్ డెలివరీ చేయడానికి చాలా దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు.
ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో తాను బైక్ దిగి ఎంతదూరం నడిచి వచ్చింది అర్ధం చేసుకోవండంటూ.. తాను తిరిగి ఎంత దూరం నడిచి వెళ్లాలో ఎత్తి చూపాడు. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కస్టమర్ తనకు కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదని నిరాశ వ్యక్తం చేస్తూ.. ఈ ఆర్డర్ కోసం కనీసం 500 నుంచి 600 మీటర్లు నడవాల్సి వచ్చిందని చెప్పాడు.
ఈ వీడియోలో.. అర్జున్ తన సొంత సమస్యలను వివరించడమే కాకుండా మొత్తం గిగ్ వర్క్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తాడు. డెలివరీ ప్లాట్ ఫామ్ ల ఒత్తిడి అంతా డెలివరీ ఏజెంట్లపైనే పడుతుందని.. కస్టమర్ ఏమి చెబితే అది చేయాలని కంపెనీ తమకు స్పష్టంగా నిర్దేశిస్తుందని.. కస్టమర్ ఆగ్రహిస్తే తక్కువ రేటింగ్ లేదా జరిమానా.. ఈ ఉద్యోగం గౌరవం అందించదని అర్జున్ చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే కాస్త భావోద్వేగానికి లోనైన డెలివరి ఏంజెంట్ అర్జున్... కేవలం సేవగా కాకుండా తమను మనుషులుగా చూడాలని ప్రజలను కోరతాడు.. కొంచెం గౌరవం, కొంచెం మానవత్వం ఒకరి రోజును మెరుగుపరుస్తాయని అంటున్నాడు. వీలైతే డెలివరీ ఏజెంట్లకు నీరు అందించాలని.. అనవసరంగా వారిని వేధించవద్దని ఆయన ప్రత్యేకంగా ప్రజలను కోరుతున్నాడు.
