Begin typing your search above and press return to search.

చిన్నారులపై అమానుషం… డేకేర్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన!

కన్నబిడ్డలను నమ్మి డేకేర్ సెంటర్లలో వదిలి వెళ్తున్న తల్లిదండ్రుల గుండెలు గుభేల్‌మనే షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

By:  Madhu Reddy   |   2 July 2026 3:13 PM IST
చిన్నారులపై అమానుషం… డేకేర్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన!
X

కన్నబిడ్డలను నమ్మి డేకేర్ సెంటర్లలో వదిలి వెళ్తున్న తల్లిదండ్రుల గుండెలు గుభేల్‌మనే షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఏం జరుగుతుందో అర్థం కాని చిన్నారులపై డేకేర్ స్టాఫ్ చేసిన క్రూరత్వం వీడియోల రూపంలో బయటపడటంతో దేశమంతా షాక్‌కు గురైంది. పసివాళ్లని కూడా చూడకుండా సిబ్బంది ప్రవర్తించిన తీరుపై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోరమైన ఉదంతం ఇప్పుడు ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

వాషింగ్ మెషీన్‌లో పెట్టి హింసలు:

బెంగళూరులోని ఉన్న ఒక డే కేర్ సెంటర్ లో ఈ అమానుషం జరిగింది. అక్కడ పనిచేసే కేర్ ఆయాలు 2 నుంచి 3 ఏళ్ల వయసున్న పసిపిల్లలను బలవంతంగా ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ లోపల, పైభాగాన ఉంచారు. అంతటితో ఆగకుండా టాయిలెట్ జెట్ స్ప్రేతో పసిపిల్లల మొహాలపై, నోటిలో నీళ్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు.

బాత్‌రూమ్‌లో వేసి తాళం:

సిబ్బంది చేసిన ఈ దారుణమైన పనికి భయపడిపోయిన చిన్నారులు భోరున ఏడవడం ప్రారంభించారు. కనీసం జాలి కూడా లేకుండా ఆ ఏడుస్తున్న పిల్లలందరినీ తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేసి బయటనుంచి తాళం వేశారు. ఇక ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ బయటకు రావడంతోనే ఈ నరకం గురించి లోకానికి తెలిసింది. పిల్లలను డేకేర్‌లో వేసి ఆఫీసులకు వెళ్లే పేరెంట్స్ ఈ వీడియోలు చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

ఐదుగురు మహిళలపై ఎఫ్‌ఐఆర్:

ఈ షాకింగ్ ఘటనపై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఇక ఈ అకృత్యానికి ఒడిగట్టిన ఐదుగురు మహిళా సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. బాధితులైన తల్లిదండ్రుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

రంగంలోకి బాలల హక్కుల కమిషన్:

ఈ దారుణమైన ఘటన కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దృష్టికి కూడా వెళ్ళింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్, వెంటనే పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును సమర్పించాలని అధికారులను ఆదేశించింది. చిన్నారులపై ఇలాంటి క్రూరత్వం చూపే సెంటర్స్ కఠిన చర్యలు తీసుకుని, లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన డేకేర్ సెంటర్లలోనే ఇలాంటి మృగాలు ఉండటం సమాజానికే సిగ్గుచేటు. కేవలం డబ్బుల కోసం కాకుండా, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో డేకేర్ యాజమాన్యం, తల్లిదండ్రులు నిరంతరం గమనించాలి. ఇక ఈ కేసులో నిందితులకు కోర్టులు కఠినమైన శిక్ష విధిస్తేనే.. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి ఎవరికైనా వణుకు పుడుతుంది.