Begin typing your search above and press return to search.

విదేశీ మహిళ నెల ఖర్చు ₹3 లక్షలు.. బెంగళూరు ఇంత కాస్ట్లీనా?

యూలియా ఈ ఖర్చులను వివరిస్తూ, "ముగ్గురు సభ్యులున్న ఒక కుటుంబానికి బెంగళూరులో నెలకు కనీసం ₹2.5 లక్షలు ఖర్చు అవుతుంది," అని అంచనా వేశారు.

By:  A.N.Kumar   |   14 Oct 2025 5:30 AM IST
విదేశీ మహిళ నెల ఖర్చు ₹3 లక్షలు.. బెంగళూరు ఇంత కాస్ట్లీనా?
X

ఐటీ హబ్గా ప్రపంచ పటంలో నిలిచిన బెంగళూరు నగరం ఇప్పుడు ఖరీదైన జీవనశైలికి కూడా ప్రతీకగా మారింది. ఈ మహా నగరంలో నివసించేందుకు అవుతున్న భారీ వ్యయాన్ని తెలియజేస్తూ.. రష్యాకు చెందిన కంటెంట్ క్రియేటర్ యూలియా తాజాగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. 11 ఏళ్ల క్రితం పరిస్థితికి.. ప్రస్తుత పరిస్థితుల ఖర్చుల్లో ఉన్న తేడాను ఆమె వివరించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

* 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన అద్దె!

గత 11 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్న యూలియా, నగరంలో జీవన వ్యయం ఎలా పెరిగిందో వివరిస్తూ, 'బెంగళూరులో జీవించడానికి నెలకు ఎంత ఖర్చు అవుతుంది?' అనే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

11 ఏళ్ల క్రితం: ఆమె చెప్పిన ప్రకారం హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో గేటెడ్ కమ్యూనిటీలో ఒక 2BHK ఫ్లాట్ అద్దె కేవలం ₹25,000 మాత్రమే. క్యాబ్ చార్జీలు ₹700 చుట్టుపక్కల ఉండేవి.

ప్రస్తుతం ఉన్న ఖర్చులు: అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని యూలియా తెలిపారు. ఆమె నెలవారీ ఖర్చుల వివరాలు వింటే ఎవరికైనా షాక్ తగలాల్సిందే.

ఖర్చుల అంశం నెలవారీ వ్యయం (రూపాయల్లో)

ఇంటి అద్దె ₹1,25,000

ఆహారం & ఇంటి అవసరాలు ₹75,000

హౌజ్ హెల్ప్ (మెయిడ్) ₹45,000

స్కూల్ ఫీజులు ₹30,000

హెల్త్ & ఫిట్‌నెస్ ₹30,000

వ్యక్తిగత ఖర్చులు (అంచనా) ₹35,000

పెట్రోల్ & ట్రావెల్ ₹5,000

మొత్తం నెలవారీ వ్యయం ₹3,45,000

గతంలో ఉన్న అద్దె ₹25,000 తో పోలిస్తే, ప్రస్తుతం ఆమె చెల్లిస్తున్న ₹1.25 లక్షల అద్దె దాదాపు ఐదు రెట్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది.

* బెంగళూరు తక్కువే, ముంబై-గురుగ్రామ్ ఇంకా ఎక్కువ!

యూలియా ఈ ఖర్చులను వివరిస్తూ, "ముగ్గురు సభ్యులున్న ఒక కుటుంబానికి బెంగళూరులో నెలకు కనీసం ₹2.5 లక్షలు ఖర్చు అవుతుంది," అని అంచనా వేశారు. ఈ మొత్తం కూడా తక్కువే అనిపిస్తుందని, ఎందుకంటే ముంబై, గురుగ్రామ్ లాంటి నగరాల్లో అయితే జీవన వ్యయం ఇంకా ఎక్కువగా ఉంటుందని తాను విన్నట్లు ఆమె పేర్కొన్నారు.

* సోషల్ మీడియాలో హాట్ టాపిక్, భిన్న స్పందనలు

యూలియా వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు ఆమె చెప్పిన వివరాలు నిజాయితీగా ఉన్నాయని ప్రశంసించారు, బెంగళూరు ఖరీదైన నగరంగా మారిందని అంగీకరించారు. మరికొందరు నెటిజన్లు ఈ భారీ ఖర్చులపై భిన్నంగా స్పందించారు. “నేను 20 ఏళ్లుగా బెంగళూరులో ఉన్నా ఇంత ఖర్చు చేయలేదు,” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ముఖ్యంగా, కొంతమంది నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ, “మీ లైఫ్‌స్టైల్ లగ్జరీగా ఉంది, అందుకే ఖర్చు ఎక్కువగా ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఇంత ఖర్చు అవసరం లేదు” అని పేర్కొన్నారు.

మొత్తానికి యూలియా వీడియో బెంగళూరులోని సామాన్య, ఉన్నత తరగతి ప్రజల జీవన ఖర్చులపై చర్చకు తెరలేపింది. ఈ ఖర్చులన్నీ ఎంచుకునే లైఫ్‌స్టైల్ మీదే ఆధారపడి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెంగళూరులో జీవనం ఇప్పుడు అత్యంత ఖరీదైనదిగా మారిందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.