ట్రాఫిక్ బెంగళూరు.. ఒక్కరే కారులో రోడ్డుపైకి వస్తే పన్ను బాదుడే
దీంతో కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఒక్కరే కారులో బయటకు వస్తే పన్ను వేయాలని నిర్ణయించింది. విదేశాల్లో కంజెషన్ ట్యాక్స్ గా దీనికి పేరుంది.
By: Tupaki Political Desk | 1 Oct 2025 9:38 AM ISTకర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ నుంచి జేపీ నగర్ కు మధ్య దూరం 23 కిలోమీటర్లు. కానీ, ఆ మధ్య ఓ ప్రయాణికుడికి ఈ దూరం ప్రయాణానికి 4 గంటల సమయం పట్టింది.
బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరడం లేదని.. తాము వేరే నగరానికి వెళ్లిపోతామని ఓ ఐటీ సంస్థ ప్రకటించింది.
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కారాల్లో భాగంగా ప్రఖ్యాత విప్రో క్యాంపస్ నుంచి వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని ఆ సంస్థ చైర్మన్ అజీం ప్రేమ్ జీని సాక్షాత్తు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కోరారు.
ఎన్నిసార్లు క్యాబ్ బుక్ చేసినా క్యాన్సిల్.. అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పినా డ్రైవర్ల తిరస్కరణ.. ఇదీ బెంగళూరులోని పరిస్థితి...
సిలికాన్ వ్యాలీపై ట్రోలింగ్...
ఒకప్పుడు ఎటుచూసినా పార్కులతో ఉద్యాన నగరిగా, భారత దేశ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులో కొన్నేళ్లుగా ట్రాఫిక్ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దేశ ఐటీ రాజధానిగా పేరున్న నగరంపై సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. దీంతో కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఒక్కరే కారులో బయటకు వస్తే పన్ను వేయాలని నిర్ణయించింది. విదేశాల్లో కంజెషన్ ట్యాక్స్ గా దీనికి పేరుంది.
ఈ సమయాల్లో మాత్రమేలే...
ఆఫీసుల నుంచి లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఒకేసారి రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుంది..? ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. అందుకని వారు ఆఫీసులకు వెళ్లే సమయం ఉదయం 8-11 మధ్య, తిరిగి వచ్చే వేళ సాయంత్రం 5-8 మధ్య కారులో ఒక్కరే వెళ్తే పన్ను వేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అయితే, ఇది కూడా అన్ని రోడ్లపై కాదు ఏడు ముఖ్యమైన మార్గాల్లో మాత్రమే.
ఆ ఏడు రోడ్లు ఇవే...
బళ్లారి రోడ్, తుమకూరు రోడ్, మాగడి రోడ్, మైసూరు రోడ్, కనకపుర రోడ్, బన్నేర్ ఘట్ట రోడ్, హోసూరు రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్. ఈ రోడ్లపైకి నిర్దేశిత సమయాల్లో కార్లలో ఒంటరిగా వస్తే ఫాస్టాగ్ ద్వారా పన్ను వసూలు చేస్తారు. కాగా, కార్లతో పాటు బైక్ లకూ దీనిని వర్తింపజేస్తారని, చార్జి రూ.50 నుంచి 75 అని తెలుస్తోంది. ఈవీలకు, కార్ పూలింగ్ పాటిస్తే పన్ను ఉండదు.
-అధిక ఆదాయం ఉండే ఐటీ జాబ్ లకు నెలవైన బెంగళూరులో 2007 నుంచి 2020 మధ్య ప్రైవేటు వాహనాల సంఖ్య 280 శాతం పెరిగింది అనేది ఒక అంచనా. రోజుకు కోటి 20 లక్షల వాహనాలు తిరుగుతుంటాయని లెక్క. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ 48 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తోందని.. సిగ్నళ్ల దగ్గర ఆగడం, ఇంధన ఖర్చు, సమయం ఇలా అన్నీ చూస్తే ఏటా రూ.20 వేల కోట్ల నష్టం జరుగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
-రద్దీ ట్యాక్స్ అనేది వాహనాలు పీక్ అవర్స్ లో రోడ్లపైకి రాకుండా చేసేందుకు విధించే పన్ను. లండన్, స్టాక్ హోమ్, సింగపూర్ లో అమల్లో ఉంది. భారత్ లో ఢిల్లీ, ముంబైలో ప్రవేశపెట్టాలని చూసినా విఫలమైంది. మరి బెంగళూరులో ఏం జరుగుతుందో?
