మా పిల్లి ప్రెగ్నెన్సీకి మీ పిల్లే కారణం.. పోలీస్ స్టేషన్ కు రచ్చ
రోటీన్ కు భిన్నమైన పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందుతుంది.
By: Garuda Media | 15 April 2026 11:33 AM ISTరోటీన్ కు భిన్నమైన పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకే చెందుతుంది. రెండుకుటుంబాలకు చెందిన పిల్లలు ప్రేమించుకోవటం.. పెళ్లి చేసుకోవటం లాంటి వాటితో రెండు కుటుంబాల మధ్య నానా రచ్చ జరగటం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ చూస్తుంటాం. ఇప్పుడు చెప్పే ఉదంతంలో పిల్లలు కాదు.. పిల్లుల విషయంలో ఇలాంటిదే జరగటమే కాదు.. పంచాయితీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. జంతువుల మధ్య చోటు చేసుకున్న ఈ ఉదంతం రెండుకుటుంబాల మధ్య కొత్త లడాయికి కారణమైంది. ఈ విచిత్ర ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సెంట్రల్ సిటీలోని శేషాద్రిపురం పరిధిలో ఇరుగు పొరుగు ఇళ్లల్లో నివసించే రెండు కుటుంబాలు చెరో పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. అందులో ఒక కుటుంబం వద్ద ఆడ పిల్లి.. మరో కుటుంబం వద్ద మగ పిల్లి ఉంది. కారణం ఏమైనా.. ఆడపిల్లి తాజాగా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ పరిణామం రెండు కుటుంబాల మధ్య కొత్త రచ్చకు కారణమైంది.
తమ పిల్లి ప్రెగ్నెంట్ కావటానికి కారణం పక్కింటి మగ పిల్లేనంటూ ఆడపిల్ల యజమాని గొడవకు దిగటమే కాదు.. పుట్టిన నాలుగు కూనల్ని మీరే పెంచుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు మగ పిల్లి యజమాని ససేమిరా అనటంతో.. గొడవ పెరిగి పెద్దది కావటమే కాదు.. పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది. ఈ ఇష్యూ మీద కేసు నమోదు చేయాలన్న డిమాండ్ కు పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. ఈ ఉదంతానికి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయటానికి సాధ్యం కాదన్న విషయాన్ని వారికి వివరించటమే కాదు..మధ్యే మార్గంగా వారి మధ్య రాజీ చేసే ప్రయత్నం చేశారు.
పోలీసుల జోక్యంతో పిల్లుల యజమానులు చెరో రెండు కూనల్ని తీసుకోవాలన్న ఒప్పందాన్ని చేసి.. అందుకు అంగీకరించేలా చేసి.. వారిని ఇళ్లకు పంపేయటంతో ఈ విచిత్ర ఉదంతం సుఖాతమైంది. మొత్తంగా పిల్లుల ప్రేమ ఎంత పని చేసింది? అన్నదిప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
