Begin typing your search above and press return to search.

పేరుకే హెల్మెట్.. ఈ ఆవిష్కరణ తెలిస్తే ఔరా అనాల్సిందే!

ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని మరిచిపోయి స్టంట్ డ్రైవింగ్ వంటి దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

By:  Madhu Reddy   |   8 Jan 2026 7:00 AM IST
పేరుకే హెల్మెట్.. ఈ ఆవిష్కరణ తెలిస్తే ఔరా అనాల్సిందే!
X

నిత్యం ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలలో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు ట్రాఫిక్ చిరాకు తెప్పిస్తుంటే.. అటు ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా చాలామందికి ఇబ్బందులను కలగజేస్తున్నాయి. అయితే అదే చిరాకు ఒక వినూత్న ఆవిష్కరణకు దారి తీస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలాగే జరిగి అందరిచేత ఔరా అనిపిస్తోంది.

నిత్యం రోడ్లపై ప్రయాణిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలను లెక్కచేయని డ్రైవర్లతో విసిగిపోయిన బెంగళూరుకు చెందిన ఒక టెక్నీషియన్.. అధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సాధారణ హెల్మెట్ ను కాస్త ఒక రకమైన కదిలే ట్రాఫిక్ పోలీసుగా మార్చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

ప్రతిరోజు రోడ్లపై జరుగుతున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణాలు , ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని మరిచిపోయి స్టంట్ డ్రైవింగ్ వంటి దృశ్యాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో చూసే మనకు చిరాకు వస్తుంటే..ఇక వీటిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి దృశ్యాలను చూసి తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిన టెక్నీషియన్ పంకజ్ తన్వర్ వినూత్నమైన ఆవిష్కరణకు కంకణం కట్టారు.

అలా టెక్నాలజీ రంగంలో పనిచేసే పంకజ్.. వీటిని అరికట్టాలంటే ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్న ఈయన సాధారణ హెల్మెట్ ను ఏఐ టెక్నాలజీతో మరింత స్మార్ట్ గా మార్చేశారు. ఇందులో ఒక కెమెరా, కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్స్, రియల్ టైం డేటా ప్రాసెసింగ్ వ్యవస్థను అమర్చారు. అతను బైక్ నడుపుతున్న సమయంలో ఈ హెల్మెట్ తన చుట్టూ జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను గమనిస్తుంది. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్లు.. అలాగే ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి వాటిని ఫ్లాగ్ చేస్తుంది.

అంతేకాదు ఈ ఉల్లంఘన ఎక్కడ జరిగింది? ఏ సమయంలో జరిగింది? అనే విషయాలతో పాటు ఆ ఫోటోలను కూడా క్యాప్చర్ చేసి సమాచారాన్ని సిద్ధం చేస్తుంది. ఇక తాను ఆవిష్కరించిన ఈ హెల్మెట్ ని వీడియో రూపంలో తన్వర్ పంచుకున్నారు. ఇక అందులో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న వ్యక్తిని ఏఐ గుర్తించి ఆ ఫోటోలను తీసింది. అలాగే రోడ్డుపై ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్న కారు సన్నివేశాలను క్యాప్చర్ చేసినట్టు చూపించారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఏది ఏమైనా బెంగళూరుకు చెందిన పంకజ్ తన్వర్ ఆవిష్కరణ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులకు మరింత ఉపయోగకరంగా మారనుంది అని చెప్పవచ్చు. ఈ హెల్మెట్ ని అందుబాటులోకి తీసుకొస్తే ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలు, హెల్మెట్ లేని ప్రయాణాలు, స్టంట్ డ్రైవింగ్ లాంటివి చేసేవాళ్లను ఇట్టే కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటు ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ వినూత్న ఆవిష్కరణకు తన్వర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వీడియో అలా వైరల్ అయిందో లేదో బెంగళూరు సిటీ పోలీసులు స్వయంగా పంకజ్ ను సంప్రదించి అతని ఆవిష్కరణకు ప్రశంసలు కురిపించారు.