ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ వైరల్ వీడియోల్లో నిజమెంత?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించటమే కాదు హ్యాట్రిక్ సీఎం మమత దూకుడుకు స్పష్టమైన బ్రేకులు వేయగలిగారు.
By: Garuda Media | 8 May 2026 12:53 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించటమే కాదు హ్యాట్రిక్ సీఎం మమత దూకుడుకు స్పష్టమైన బ్రేకులు వేయగలిగారు. ఒకప్పుడు ఉనికి కోసం పోరాడిన బీజేపీ.. ఈ రోజున అధికారపక్షంగా అవతరించింది. ఇదేమీ ఒకట్రెండు రోజుల్లో సాగలేదు. ఇందుకోసం ఏళ్లకు ఏళ్లు ప్రయత్నించాల్సి వచ్చింది. బీజేపీ ఒక రాష్ట్రాన్ని టార్గెట్ చేసి.. అక్కడ అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నించినప్పటికి ఫలితం అందుకోని రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరింది. దశాబ్దాల పర్యంతం బెంగాల్ కోట మీద కాషాయ జెండా ఎగరాలన్న కమలనాథుల సంకల్పం తీరింది.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావటమే కాదు.. బెంగాల్ లో నిజంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అన్న సందేహానికి గురి చేసేలా మారాయి. అదేమంటే.. బెంగాల్ లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించిన వేళ.. బంగ్లాదేశ్ కు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున వారి దేశానికి తరలిపోతున్నారని.. ఇలా వెళుతున్న వారి సంఖ్య వందల్లో కాదు.. వేలల్లో కూడా కాదు లక్షల్లో ఉన్నట్లుగా కొన్ని వైరల్ వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి.
నిజంగానే బెంగాల్ లో అలాంటి పరిస్థితి ఉందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇంత భారీగా తమ దేశానికి తరలి వస్తున్న వారిని ఏ దేశం కూడా వెంటనే అంగీకరించదు. అందునా బంగ్లాదేశ్ మరింత తీవ్రంగా స్పందించే వీలుంది. నిజంగానే లక్షలాది మంది బంగ్లాదేశీయులు వారి దేశానికి తరలి వెళ్లటం అసలు ఎలా సాధ్యం? సరిహద్దులు.. భద్రతా దళాలు ఇవన్నీ ఉంటాయి కదా? వైరల్ వీడియోల్లో చూపినట్లుగా అంత భారీగా తరలివెళుతుంటే.. సరిహద్దులు మొత్తం కిక్కిరిసిపోవాలి కదా?
అదే జరిగితే.. అంతర్జాతీయ మీడియా ఊరికే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో రాలేని విధంగా వీడియోలను కట్ చేయటం.. ఉద్వేగపూరిత వ్యాఖ్యలతో ఆలోచన చేసే మెదడును పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల మాటేమిటి? అన్న విషయంలోకి వెళితే.. షాకింగ్ నిజాలు వెలుగు చూస్తాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వీడియోల్లో మొదటిది.. వేలాది మంది ముస్లింలు పెద్ద లగేజ్ తో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లటం కనిపిస్తుంటుంది. అయితే.. ఆ వీడియో ఇప్పటిది కాదు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 5 వరకు పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా.. పుయినాన్ లో జరిగిన బిశ్వ ఇజ్తేమా పేరిట జరిగిన భారీ ముస్లిం మత సభకు వెళుతున్న వారికి సంబంధించింది. దీన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ కు తిరిగి వెళుతున్నట్లుగా తప్పుడు వ్యాఖ్యలతో వైరల్ చేస్తున్నారు.
మరో అంశం ఏమంటే.. ఈ ఒరిజినల్ వీడియోను సోషల్ మీడియాలో జనవరి ఐదున స్థానిక కంటెంట్ క్రియేటర్ దీప్ ఘోష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దీన్ని పోస్టు చేసింది కూడా జనవరి ఐదున. అప్పటికి ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. అప్పటి వీడియోను తప్పుడు వ్యాఖ్యలతో తప్పుగా వైరల్ చేస్తున్నారు. చాలామంది దీన్ని నిజమైన వీడియోగా నమ్ముతున్న దుస్థితి.
వైరల్ అవుతున్న మరో వీడియో విషయానికి వస్తే.. అందులో పెద్ద ఎత్తున పడవ ఎక్కుతున్నట్లుగా ఉంటుంది. అది కూడా నిజమైన వీడియో కాదు. నిజానికి ఈ వీడియో పశ్చిమ బెంగాల్ ది కాదు. బంగ్లాదేశ్ లోని మోంగ్లా ప్రాంతానికి చెందింది. 2025లో నవంబరులో బంగ్లాదేశ్ లో జరిగిన చార్మోనై మహఫిల్ అనే ప్రోగ్రాంకు హాజరై.. తిరిగి వెళుతున్న వారికి సంబంధించినవి. అయితే.. దీన్ని కూడా తప్పుగా వైరల్ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న మరో వీడియో విషయానికి వస్తే.. 2025 అక్టోబరులో శ్యామా పైజ నిమజ్జన ఊరేగింపునకు సంబంధించింది కానీ.. దాన్ని కూడా తాజాగా వీడియోగా వైరల్ చేస్తున్నారు. ఇలా ఎన్నో తప్పుడు వీడియోలు బెంగాల్ లో తాజా పరిస్థితి అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి.
