2 దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న బెలూన్స్.. ముదురుతున్న వివాదం!
దీంతో ఓ కీలక విమానాశ్రయం తరచూ మూసివేయాల్సి వస్తోందని, దీనివల్ల విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ మీడియా తెలిపింది. విషయం ఏమిటంటే..
By: Madhu Reddy | 3 Dec 2025 2:00 PM ISTఐరోపా ఖండంలోని రెండు దేశాల మధ్య బెలూన్ల కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఓ కీలక విమానాశ్రయం తరచూ మూసివేయాల్సి వస్తోందని, దీనివల్ల విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ మీడియా తెలిపింది. విషయం ఏమిటంటే.. వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం బెలారస్ వెదర్ బెలూన్లని ప్రయోగిస్తోంది. కానీ అవి మాత్రం బెలారస్ లో అదుపుతప్పి లిథువేనియా గగనతలంలోకి వెళ్తున్నాయి. ఇలా వెళ్లడం వల్ల లిథువేనియాలోని ఓ ప్రధాన విమానాశ్రయ కార్యకలాపాలకు తరచూ అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
రీసెంట్ గా బెలారస్ అడవుల నుండి 60 బెలూన్లు ఎగురవేశారట. అందులో 40 బెలూన్లు విమాన భద్రతకు కీలకమైన ప్రాంతాల్లోకి చేరుకున్నాయని,అలాగే ఇది ఇప్పటివరకు అత్యంత తీవ్రమైన సంఘటనలలో ఒకటిగా మారింది అంటూ లిథువేనియా అధికారులు తెలుపుతున్నారు. అంతేకాదు బెలూన్లను క్రమం తప్పకుండా సమయ వ్యవధిలో పంపి రన్ వేల పైకి మళ్ళించినట్టు కనిపించిందని లిథువేనియా విమానయాన అధికారులు తెలిపారు. ఇది తమ ఆర్థిక వ్యవస్థ,విమానయాన భద్రత మరియు మొత్తం దేశం పై జరిగిన ఒక విరక్తి హైబ్రిడ్ దాడి అంటూ లిథువేనియా విదేశాంగ శాఖ ఉపమంత్రి టౌరిమస్ చెప్పుకొచ్చారు..
అయితే లిథువేనియా విదేశాంగ శాఖ ఉపమంత్రి వ్యాఖ్యలపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మాట్లాడుతూ.. "ఇవి కేవలం వెదర్ బెలూన్లు మాత్రమేనని,ఒకవేళ ఇందులో బెలారస్ ప్రమేయం ఉన్నట్లు రుజువైతే క్షమాపణలు చెబుతామని" తెలిపారు. అంతేకాదు లిథువేనియా మా గగనతలంలోకి డ్రోన్లు పంపుతూ మా దేశ గూఢచర్యానికి పాల్పడుతూ వీటి ద్వారా ఉగ్రవాదులకు అవసరమయ్యే సామాగ్రిని పంపిణీ చేస్తున్నారని బెలారస్ అధ్యక్షుడు ఆరోపించారు. లిథువేనియా బెలూన్ ల కారణంగా తమ దేశ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని, అక్టోబర్ లో బెలారస్ సరిహద్దును మూసేసింది. దాంతో బెలారస్ రివేంజ్ తీర్చుకోవడం కోసం తమ దేశంలోని లిథువేనియాకి చెందిన దాదాపు 1000కి పైగా కార్గో ట్రక్కులను తమ దేశం దాటి బయటకు వెళ్లకుండా అడ్డుకుంది.
కానీ లాజిస్టిక్స్ సంస్థల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి కారణంగా తిరిగి లిథువేనియా - బెలారస్ సరిహద్దులను తెరిచింది. అయితే దాదాపు మూడు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.కానీ బెలారస్ రష్యాకు మిత్ర దేశం.. ఇదే సమయంలో సెప్టెంబర్ లో నాటో దేశాల గగనతలంలోకి భారీ ఎత్తున డ్రోన్లు వచ్చాయి. అయితే ఈ డ్రోన్లను రష్యా ప్రయోగించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బెలూన్ ల పరిణామంతో ఐరోపా ఖండంలోని బెలారస్ - లిథువేనియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
