Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో పాద‌యాత్ర‌... ఈ సారి బోడే వంతు ...!

త్వ‌ర‌లోనే ఆయ‌న పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. దీనిపై ప్ర‌స్తుతం ప్లాన్ చేస్తున్న‌ట్టు బీసీవై నాయ‌కులు చెబుతున్నారు.

By:  Garuda Media   |   6 Nov 2025 10:21 AM IST
ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో పాద‌యాత్ర‌... ఈ సారి బోడే వంతు ...!
X

భార‌త చైత‌న్య యువజ‌న పార్టీ(బీసీవై) వ్య‌వ‌స్థాప‌కుడు.. బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌.. పార్టీని మ‌రింత జోరుగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. దీనిపై ప్ర‌స్తుతం ప్లాన్ చేస్తున్న‌ట్టు బీసీవై నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు.. రైతుల స‌మ‌స్య‌ల‌పై బోడే పాద‌యాత్ర చేయ‌డం కొత్త‌కాదు. కొన్నాళ్ల కింద‌ట త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆయ‌న పాద‌యాత్ర చేశారు.

పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకునేందుకు బోడే రామచంద్ర‌యాద‌వ్‌.. పాద‌యాత్ర‌ను అస్త్రంగా మార్చుకున్నారు. ఇది.. ఆయ‌న‌కు ఓటు బ్యాంకు రూపంలో గెలుపు గుర్రం ఎక్కించ‌క‌పోయినా.. ప్ర‌జ‌ల్లో సానుభూతి, మంచి వాయిస్ ల‌భించేందుకు.. అవ‌కాశం క‌ల్పించింది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. సామాన్యుల నేత‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ప్ర‌కాశం, నెల్లూరు నుంచి రాయ‌ల సీమ జిల్లాల్లో బోడే పేరు అంద‌రికీ సుప‌రిచితంగా మారింది.

అయితే.. ఇటు కోస్తా, ఉత్త‌రాంధ్ర‌ల్లోనూ.. పార్టీని పుంజుకునేలా చేయాల‌న్న‌ది బోడే ప్ర‌య‌త్నం. దీనిలో భాగంగానే ఆయ‌న రాష్ట్ర స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుంటున్న‌ట్టు కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు. బ‌స్సు యాత్ర ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని భావించారు. అయితే.. దీనికంటే.. పాద‌యాత్ర ద్వారా అయితే.. రాస్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వ‌స్తుంద‌ని అంచ‌నా వేసుకుంటున్న బోడే.. ఆదిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. పార్టీ నాయ‌కుల‌తోగ‌త కొన్ని రోజులుగా ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్నారు.

ప్ర‌స్తుతం కార్తీక మాసం కొన‌సాగుతోంది. ఇది అయిపోయిన త‌ర్వాత‌.. పాద‌యాత్ర ఉండే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. పాద‌యాత్ర ద్వారా గ్రామాలు.. ప‌ట్ట‌ణాల‌ను క‌వ‌ర్ చేయ‌డంతోపాటు.. ప్ర‌చారానికి కూడా అవకాశం ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్‌, నారా లోకేష్‌లు పాద‌యాత్ర చేసి.. పార్టీల‌ను అధికారంలోకి తెచ్చుకునే ప్ర‌యత్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ కోణంలోనే బోడే కూడా పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. త‌ద్వారా సామాన్యుల ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ముహూర్తం కూడా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిసింది.