అతను భారత్ ఏజెంట్.. బీసీబీ!
తమకు వ్యతిరేకంగా మాట్లాడినా తమ విధానాలను తప్పబట్టినా వారిని మరో దేశ ఏజెంట్ అంటూ నిందించడం చాలా దేశాల్లో చాలా కాలంగా సాగుతోంది.
By: A.N.Kumar | 9 Jan 2026 9:00 PM ISTతమకు వ్యతిరేకంగా మాట్లాడినా తమ విధానాలను తప్పబట్టినా వారిని మరో దేశ ఏజెంట్ అంటూ నిందించడం చాలా దేశాల్లో చాలా కాలంగా సాగుతోంది. ఇప్పుడు అది బంగ్లాదేశ్ లో కూడా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరిన మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ను భారత ఏజెంట్ అంటూ బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ సోషల్ మీడియాలో నిందించారు.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ తోపాటు శ్రీలంక వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. అయితే భద్రతా కారణాలతో తమ జట్టు ఇండియాకు రాలేదని, తటస్థ వేదికలపై మ్యాచ్ నిర్వహించాలని బీసీబీ .. ఐసీసీకి మెయిల్ చేసింది. దీనికి ఐసీసీ నుంచి సమాధానం రాలేదు. దీనిపై మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ స్పందించారు. బీసీబీకి 90 నుంచి 95 శాతం ఆదాయం ఐసీసీ నుంచి వస్తుందని, నిర్ణయాలు తీసుకునే ముందు సమీక్షించుకోవాలని కోరారు. దీంతో బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ తీవ్రస్థాయిలో స్పందించారు. తమీమ్ ఇక్బాల్ ఇండియన్ ఏజెంట్ అన్న విషయంలో మరోసారి నిరూపితమైందని నజ్ముల్ ఇస్లామ్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
ఇండియాలో ఎందుకు వద్దంటున్నారు ?
బంగ్లాదేశ్ లో చాలా కాలంగా భారత వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. దీని వెనుక పాకిస్థాన్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కూడా పాక్ ప్రమోయం ఉందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీబీ ఇండియాలో టీ ట్వంటీ మ్యాచ్ ఆడటానికి ఇష్టపడటంలేదన్న వాదన ఉంది. అయితే బీసీబీ అభ్యర్థనను ఐసీసీ పట్టించుకున్నట్టు లేదు. అందుకే బీసీబీ మెయిల్ కు తిరిగి సమాధానం ఇవ్వలేదని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.
బీసీబీకి భారీ నష్టం
ఒకవేళ ఐసీసీ బీసీబీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నష్టపోతుందని అంచనా వేస్తున్నారు. బీసీబీకి 90 శాతంపైగా ఆదాయం ఐసీసీ నుంచే వస్తుంది. భారత్ లో మ్యాచ్ ఆడకపోతే ఆ ఆదాయం కోల్పోనుంది. ఇదే అంశాన్ని మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రస్తావించారు. బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని బీసీబీకి సూచించారు.
బీసీబీ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో తమీమ్ పై బీసీబీ సభ్యుడు నజ్ముల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మాజీ క్రికెటర్ తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసినట్టు కనిపిస్తున్నాయి. బహిరంగ వ్యాఖ్యల ద్వారా కంటే చర్చల ద్వారా సున్నిత అంశాలను పరిష్కరించుకోవాలని బీసీబీకి సూచించారు. ఈ మాటలను జీర్ణించుకోలేని బీసీబీ భారత ఏజెంట్ గా ముద్ర వేసే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
