42 శాతం కోసం.. 8 రకాల ఉద్యమాలు!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను ఎట్టి పరిస్థితిలోనూ సాధించాలని పట్టుదలపై ఉన్న బీసీ ఐక్య వేదిక.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
By: Garuda Media | 3 Nov 2025 11:38 AM ISTబీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను ఎట్టి పరిస్థితిలోనూ సాధించాలని పట్టుదలపై ఉన్న బీసీ ఐక్య వేదిక.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ సాధన కోసం ఇప్పటి వరకు ధర్నాలు, రాస్తారోకోలు.. గత నెలలో తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రపతికానీ, తెలంగాణ గవర్నర్ కానీ.. ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో గాంధేయ మార్గంలో రిజర్వేషన్‌ను దక్కించుకునేందుకు బీసీ ఐక్యవేదిక కార్యాచరణ రెడీ చేసింది. ఇది పూర్తిగా శాంతియుతంగా అదేసమయంలో సీరియస్‌గా కూడా ఉంటుందని నాయకులు చెబుతున్నారు. దీనిలో భాగంగా 8 రకాల ఉద్యమాలతో బీసీ రిజర్వేషన్‌ను సాధించుకునేందుకు పక్కాప్లాన్ రెడీ చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి.. మూడు నెలల పాటు.. దీనిని కొనసాగించనున్నారు. ఈ క్రమంలో 8 రకాలుగా దీనిని ముందుకు తీసుకువెళ్లనున్నారు.
``గౌతమ బుద్ధుడి స్ఫూర్తితో ‘అష్టాంగ’ ఆందోళనలుగా ఉద్యమానికి పేరు పెట్టాం`` అని బీసీ నాయకులు చెప్పారు. ఈ ఉద్యమంలో ఒక్క బీసీలే కాకుండా.. ఎస్టీ, ఎస్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. మరోవైపు.. బీసీ ఉద్యమ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఏకంగా దేశవ్యాప్తంగా 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలన్న ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటించి.. బీసీలకు మేలు చేసేలా చేస్తామన్నారు.
ఇవీ.. 8 రకాల ఉద్యమాలు..
1) మౌన దీక్ష
2) పల్లె నుంచి పట్నం వరకు బీసీల ధర్మ పోరాట దీక్ష
3) సామాజిక న్యాయం కోసం `పరుగు`(రన్ ఫర్ సోషల్ జస్టిస్)
4) ఎంపీలతో బీసీల ములాఖత్
5) అఖిలపక్ష పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి వివరించడం.
6) బీసీల చలో ఢిల్లీ
7) పార్లమెంటు ముట్టడి
8) పల్లె నుంచి పట్నం వరకు బస్సుయాత్ర
