బీసీ రిజర్వేషన్లు...తమిళనాడు గెలిచింది !
దానికి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే ఈ పరిమితిని మార్చవచ్చు అని సూచిస్తున్నారు.
By: Tupaki Political Desk | 9 Oct 2026 9:02 PM ISTరిజర్వేషన్లు ఎంత ఉండాలి అన్నది రాజ్యాంగంలో పొందుపరచలేదు. రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకూడదనే నిబంధనను నేరుగా రాజ్యాంగంలో మరెక్కడా రాయలేదు. అయితే యాభై శాతం పరిమితి ఎలా వచ్చింది అంటే 1992లో ఇందిరా సాహ్ని మండల్ కమిషన్ కి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు విధించిన ఒక చట్టపరమైన గరిష్ట పరిమితిగా ఇది ఉంది. దాంతో కోర్టుల ద్వారా అయితే యాభై శాతం పరిమితిని కచ్చితంగా అక్కడ చూస్తారు. అందువల్ల ఎన్ని సార్లు ఎవరు ప్రయత్నం చేసినా వీగిపోతుంది. మరి బీసీల విషయంలో చిత్త శుద్ధితో అంతా కలిసి ప్రయత్నం చేస్తే వారికి అనుకున్నట్లుగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే అని అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. దానికి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే ఈ పరిమితిని మార్చవచ్చు అని సూచిస్తున్నారు.
తమిళనాడు విజయం :
ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులో మొత్తం 69 శాతం రిజర్వేషన్ల విధానం అమలవుతోంది. ఇది ఎట్లా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ తమిళనాడులో ప్రత్యేక చట్టంతో పాటు రాజ్యాంగ రక్షణ ద్వారానే 69 శాతం కోటా కొనసాగుతోంది. అక్కడ అమలు అవుతున్న రిజర్వేషన్ల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. వెనుకబడిన తరగతులు అయిన బీసీలకు 26.5 శాతం, బీసీ ముస్లింలకు 3.5 శాతం ఇస్తున్నారు. అలాగే అత్యంత వెనుకబడిన వర్గాలు అంటే ఎంబీసీలకు 20 శాతం అమలు చేస్తున్నారు. అంటే ఈ లెక్కన యాభై శాతం దాకా బీసీలకు అక్కడ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్న మాట. ఇక ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక శాతం కలిపితే మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.
ఎలా వీలు పడిందంటే :
తమిళనాడు ప్రభుత్వం 1993లో తమిళనాడు వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు విద్యాసంస్థలలో సీట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. ఆ మీదట అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో 1994లో జరిగిన 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీనివల్ల ఈ చట్టం న్యాయ సమీక్ష నుంచి పూర్తిగా మినహాయింపు పొందింది. ఇక ఈ ప్రత్యేక చట్టానికి భారత రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల విధానం చట్టబద్ధంగా అమలులో ఉంది. అంటే దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా తమిళనాడు ఈ విషయంలో ఘన విజయం సాధించింది అని గుర్తు చేస్తున్నారు.
రిజర్వేషన్లు 59 శాతం :
నిజానికి దేశంలో అమలు అవుతున్న రిజర్వేషన్లు యాభై శాతం కాదని 59.5 శాతం అని రాజ్యాంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు 2019 ప్రాంతంలో పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ కేన్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. అందువల్ల బీసీలకు రిజర్వేషన్లు అనుకున్న విధంగా కల్పించాలి అంటే దానికి పార్లమెంట్ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. పార్లమెంట్ లో రిజర్వేషన్ల పెంపును కోరుతూ సవరణ బిల్లుని ఆమోదించాలి. రాజ్యసభ లోక్ సభలలో మూడింట రెండు వంతున మెజారిటీతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే కచ్చితంగా రిజర్వేషన్ల పరిమితి పెరుగుతుంది. అపుడు అనుకున్న విధంగా దానిని అమలు చేయవచ్చు. అయితే ఈ విధంగా రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ అది రాజ్యాంగం ప్రాథమిక స్వరూపాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. ఒకవేళ రాజ్యంగ సవరణ సవరణ జరిగితే దానికి బలమైన సామాజిక, ఆర్థిక గణాంకాలు అన్నీ చూసుకోవాలి. లేకపోతే ఈ సవరణను సైతం సుప్రీంకోర్టు న్యాయపరంగా సమీక్షించే అవకాశం ఉంటుంది.
మూడు సార్లు ఇలా :
ఇక పోతే వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే కోర్టులో అది వీగిపోయింది. అలాగే తెలంగాణా ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూసినా, తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు 34 శాతం ఇవ్వాలని కోరుకున్నా కోర్టులు కొట్టేశాయి. అందువల్ల ఈ విధానం కాదు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒత్తిడి పెంచేలా అన్ని పార్టీలు కృషి చేయాలి. బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉంటాయి కాబట్టి రాజ్యాంగ సవరణ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందుతుందని అంటున్నారు.
