Begin typing your search above and press return to search.

బీజేపీ ఆఫీసులో తన్నుకున్న బీసీ నేతలు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే బీసీ నేతల మధ్య ఘర్షణ, కొట్లాట చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

By:  A.N.Kumar   |   15 Oct 2025 3:42 PM IST
బీజేపీ ఆఫీసులో తన్నుకున్న బీసీ నేతలు
X

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే బీసీ నేతల మధ్య ఘర్షణ, కొట్లాట చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే ఈనెల 18న బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కి బీజేపీ మద్దతు తెలపాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే ప్రెస్‌మీట్ ప్రారంభం కావడానికి ముందే నేతల మధ్య ఫొటోల్లో ఎవరు ముందుకు రావాలనే అంశంపై వాగ్వాదం చెలరేగింది. “జూనియర్‌గా ఉన్న నువ్వు ఎలా ముందుకు వస్తావ్?” అంటూ మొదలైన మాటల యుద్ధం, క్షణాల్లోనే కొట్లాటగా మారింది. ఒకరిపై మరొకరు చేయి చేసుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఘటన స్థలంలో ఉన్న ఆర్‌.కృష్ణయ్య, రామచందర్ రావు నేతలను ఆపేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరికి ఇతర బీసీ నేతల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద కలకలం రేపింది.

ఈ సంఘటనపై బీజేపీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. . పార్టీ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి.

బీజేపీ ఆఫీసులో బీసీ నేతల మధ్య చిన్నపాటి ఫొటో వివాదం ఘర్షణగా మారి పెద్ద కలకలం రేపింది. బీజేపీ, బీసీ సంఘాల మధ్య సమన్వయం కోసం వెళ్లిన నేతలే ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది.