బీబీసీని వెంటాడుతోన్న ట్రంప్... తాజా బిగ్ షాక్ ఇదే!
అవును... అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చడంతో బీబీసీ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే.
By: Raja Ch | 15 Nov 2025 5:43 PM ISTజనవరి 6, 2021 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ పై తన మద్దతుదారులు దాడులు చేసిన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ సుమారు గంట పాటు ప్రసంగించారు! దీనిని తన పనోరమ డాక్యుమెంటరీలో బీబీసీ తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేయడంతో.. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్షుడైన ట్రంప్.. బీబీసీని వదిల బొమ్మాలీ అంటూ వెంటపడుతున్నారు!
అవును... అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చడంతో బీబీసీ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రసంగాన్ని మార్చినందుకుగాను ఆ సంస్థపై $5 బిలియన్ల దావా వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో.. ట్రంప్ కు అంత మొత్తం చెల్లించాల్సిందేనంటూ ఆయన న్యాయబృందం ఇప్పటికే బీబీసీకి లేఖ రాసింది.
సారీ చెప్పిన బీబీసీ.. తప్పదన్న ట్రంప్!:
ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బీబీసీ క్షమాపణలు చెప్పింది. ఇదే సమయంలో... బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇచ్చేందుకూ నిరాకరించింది. దీంతో.. ట్రంప్ నుంచి మరోసారి హెచ్చరికలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా... వచ్చే వారంలో బీబీసీపై 1 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు కోర్టులో దావా వేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
వాస్తవానికి.. ఈ ఎఫెక్ట్ తో ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన బీబీసీ ఛైర్మన్ సమీర్ షా స్పందిస్తూ... అమెరికా అధ్యక్షుడి ప్రసంగాన్ని సవరించినందుకు తాను, బీబీసీ చింతిస్తున్నట్లు శ్వేతసౌధానికి వ్యక్తిగత లేఖ పంపారు.
ఇదే సమయంలో... ట్రంప్ డిమాండు చేసిన బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరించినట్లు సంస్థ వెల్లడించింది. అయితే ట్రంప్ మాత్రం పరిహారం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. పరిహారం కోసం వచ్చే వారంలో కోర్టులో దావా వేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో చర్చించనున్నట్లు తెలిపారు.
ట్రంప్ వర్సెస్ ప్రెస్ ఇదే ఫస్ట్ టైం కాదు!:
మీడియా సంస్థలపై ట్రంప్ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడటం ఇదే మొదటిసారి కాదు. ఆయన ఇటీవల, అమెరికాలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో కొన్నింటిపై బిలియన్ డాలర్ లకు దావా వేశారు. ఇందులో భాగంగా.. సీ.ఎన్.ఎన్., ఏబీసీ (యూఎస్), సీబీఎస్, వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్ టైమ్స్ వంటి మీడియా సంస్థలను ఆయన తగులుకున్నారు!
