Begin typing your search above and press return to search.

ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన ట్రంప్.. ఒక్క బీబీసీతోనే ఇలా..?

2021, జనవరి 6వ తేదీ వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ దాడి ప్రపంచ రాజకీయ చరిత్రలో మచ్చతెచ్చిన ఘట్టం.

By:  Tupaki Political Desk   |   11 Nov 2025 1:07 PM IST
ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన ట్రంప్.. ఒక్క బీబీసీతోనే ఇలా..?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఒకసారి ప్రపంచ మీడియాను తన వైపునకు తిప్పుకున్నారు. బీబీసీ 2021లో క్యాపిటల్ హిల్ దాడి సందర్భంగా తన ప్రసంగాన్ని తప్పుడు విధంగా ఎడిట్ చేసిందని ఆరోపిస్తూ ట్రంప్ న్యాయవాదులు ఆ సంస్థకు బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో శుక్రవారం (13.11.25) వరకు గడువు ఇవ్వడం.. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం వివాదాన్ని మరింత రాజకీయ, న్యాయ కోణాలుగా చూపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత పరువు నష్టం కేసు కాదు.. ప్రపంచ మీడియా బాధ్యతపై నడిచే చర్చకు ఇది కొత్త మలుపు.

అసలు బీబీబీ చేసిన తప్పేంటి?

2021, జనవరి 6వ తేదీ వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ దాడి ప్రపంచ రాజకీయ చరిత్రలో మచ్చతెచ్చిన ఘట్టం. ఆ రోజు ట్రంప్ ప్రసంగం బీబీసీ పనోరమా డాక్యుమెంటరీలో చూపించడం వల్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అసలు వీడియోలో ఆయన ‘శాంతియుతంగా, దేశభక్తితో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయండి’ అని అన్నా.. ఎడిటెడ్ వెర్షన్‌లో ‘క్యాపిటల్ హిల్‌కి వెళ్లి ఘోరంగా పోరాడదాం’ అన్న మాటలు మాత్రమే ప్రసారం కావడం వల్ల అర్థం పూర్తిగా మారిపోయింది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ‘తప్పుడు స్టేట్‌మెంట్’గా రావడంతో బాధ్యత వహిస్తూ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ డెబోరా టర్నెస్ రాజీనామా చేశారు.

పూర్తిగా ఉప సంహరించుకోవాలి..

ట్రంప్ లాయర్ అలెజాండ్రో బ్రిటో పంపిన లేఖలో తప్పుడు డాక్యుమెంటరీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేదా ఒక బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖ ట్రంప్ రాజకీయ వ్యూహానికి మరో రంగు పూసింది. తనపై మీడియా వేసిన దుష్ప్రచారానికి వ్యతిరేకంగా నిలిచే ధోరణిగా ఈ చర్యను ప్రదర్శిస్తున్నారు. బీబీసీ ఇప్పటికే క్షమాపణలు తెలిపినా.. ట్రంప్ దీన్ని సరిపడని చర్యగా పేర్కొంటూ న్యాయపరమైన పోరాటానికి సిద్ధం అవుతున్నారు.

మీడియా స్వేచ్ఛపై అనుమానాలు..

ఈ సంఘటన ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూత్రాలను తిరిగి చర్చకు తెచ్చింది. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది. కానీ ఆ స్వేచ్ఛా నిజాయితీతో కూడి ఉండాలి. సమాచారాన్ని కత్తిరించడం, దాన్ని రాజకీయంగా వక్రీకరించడం కేవలం వార్తా తప్పిదం కాదు. అది ప్రజల నమ్మకంపై దెబ్బ. బీబీసీ లాంటి విశ్వసనీయ సంస్థ ఈ పొరపాటు జరగడం, ‘విశ్వసనీయత’ కూడా మానవ తప్పిదాల ముసుగులో నలిగిపోవచ్చని నిరూపించింది.

ఇది రాజకీయ ప్రతీకారణమా?

ఇకపోతే, ట్రంప్ లేఖను చాలా మంది రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నడిచే మీడియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ వివాదం వెనుక అసలు ప్రశ్న ఒకటి తలెత్తుతుంది. ‘సత్యం ఎంతవరకు చెప్పచ్చు?’ అనే దానిదే. వార్తా స్వేచ్ఛ అంటే వాస్తవాలను నిస్సందేహంగా చెప్పే హక్కు. కానీ వాస్తవాలను సగం చూపి, సగం దాచిపెట్టి రాజకీయ అర్థం కల్పించడం స్వేచ్ఛ కాదు. అది బాధ్యతారాహిత్యం.

ఈ కేసు మీడియా వ్యవస్థకు ఒక పాఠం కావాలి. ప్రతీ సంస్థ తమ ఎడిటింగ్, ఫాక్ట్ చెకింగ్ విధానాలను కఠినతరం చేయాలి. ఎడిటింగ్ అంటే కళ, కానీ అదే ఎడిటింగ్ వాస్తవాన్ని వక్రీకరిస్తే అది నేరం. బీబీసీ ఘటన జర్నలిజం ప్రపంచానికి ఇచ్చిన పాఠం ఇదే. సత్యాన్ని తొలగించవద్దు నిజాన్ని వారికి అనుకూలంగా మలుచవద్దు. సమాచారం అనేది ప్రజల నమ్మకం.

ట్రంప్ లేఖతో బీబీసీ కుదేలై ఉండొచ్చు.. కానీ ఈ ఘటన ప్రపంచ మీడియా వ్యవస్థను మేల్కొలిపింది. స్వేచ్ఛ ఉన్న చోట బాధ్యత మరింత ఎక్కువగా ఉండాలి. వార్తా ప్రసారం చేసే ప్రతి మాట వెనుక నైతిక బలం ఉండాలి. సత్యం మీద విశ్వాసం నిలిపే జర్నలిజమే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. బీబీసీ చేసిన పొరపాటు ఆ సత్యాన్ని తాకినా, ప్రపంచ మీడియా ఇప్పుడు దాన్ని తిరిగి నిలబెట్టే సమయం వచ్చింది.