ఉత్తరాంధ్రను వణికించబోతున్న ఆర్నబ్ !
ఆర్నబ్ అంటే బెంగాలీ భాషలో మహా సముద్రం అని అర్థం. అంటే ఒక సముద్రం మాదిరిగా ఆర్నబ్ తుపాను తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు అన్న మాట.
By: Satya P | 18 Sept 2026 1:28 PM ISTఈ సీజన్ లో ఇదే తొలి తుపాను. ఇప్పటిదాకా అల్ప పీడనాలతోనే సీజన్ సరిపోయింది. ఎల్ నినో ప్రభావంతో అల్ప పీడనాలు కూడా వర్షాలను ఎక్కువగా కురిపించ లేకపోయాయి. కానీ ఇపుడు మొదటి తుపాను రూపు దిద్దుకోనుంది. ఇది అరవీర తీవ్రంగానే తన ప్రతాపం చూపిస్తుంది అని అంటున్నారు. దీని తాకిడికి ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు ఒడిషాలోని కొన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయని అంటున్నారు. ఈ తుపాను తీవ్రంగా బలపడితే దానికి ఆర్నబ్ అన్న పేరుని పెట్టాలని అనుకుంటున్నారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరుగా ఉంది. ఆర్నబ్ అంటే బెంగాలీ భాషలో మహా సముద్రం అని అర్థం. అంటే ఒక సముద్రం మాదిరిగా ఆర్నబ్ తుపాను తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు అన్న మాట.
ఈ నెల 20న తరువాత :
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన ఒక బలమైన వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం సముద్రంలో నెలకొన్న అనువైన పరిస్థితుల వల్ల ఈ వాయుగుండం మరింతగా బలపడి తుపానుగా పరివర్తన చెందే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ పెను తుపాను కనుక ఏర్పడి దూసుకుని వస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్రా జిల్లాల మీదనే ఉండబోతోంది అని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు అంచనా కడుతున్నాయి. ఈ తుపాను మీద ఈ అంచనా అయితే ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితులు ఈ వాయుగుండం తీవ్ర తుపానుగా మారేందుకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నాయని అంటున్నారు. వీటికి ఎల్ నినో పరిస్థితులు వేడి గాలులు కనుక తోడు అయిన పక్షంలో ఆర్నబ్ ఒక సాధారణ తుఫాన్ స్థాయి నుంచి భారీ తుపాన్ గా రూపాంతరం చెందుతుందని అంచనాలు అయితే ఉన్నాయి.
ఆర్నబ్ గమనం చూస్తే :
ఇక ఈ భారీ తుపాను గా మారే క్రమంలో ఆర్నబ్ తూర్పు తీరం వైపు వేగంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రా పశ్చిమ ఒడిషాల మధ్యలో ఈ భారీ తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ నెల 20 నుంచే ఒడిశా ఉత్తరాంధ్రా జిల్లాలలో భారీగా వానలు కురిసే అవకాశం ఉంది. ఇక 21, 22 తేదీలలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలే పడుతాయని అంచ్న వేస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలలో ఇది తీవ్రంగానే ఉండొచ్చు అని అంటున్నారు.
ఒక విధంగా వరంగా :
గత కొన్ని నెలలుగా నైరుతి సీజన్ ఉన్నా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో ఉత్తరాంధ్రా జిల్లాలు ఉన్నాయి. దాంతో ఆర్నబ్ వంటి భారీ తుపాన్ సంభవిస్తే పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ భారీ తుపాను కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రంలోనూ అనేక జిల్లాలకు వర్షాలను తీసుకుని వస్తుందని అంటున్నారు. అడుగంటిన భూగర్భ జలాలతో అల్ల్లాడుతున్న జనాలకు ఈ విధంగా వర్షాలతో ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ఆర్నాబ్ తుపాన్ విషయంలో ఆందోళనకరమైన అంచనాలు ఉన్నప్పటికీ భారీ వానలు కురిస్తే అదే పది వేలు అన్నదే అంతా అంటున్నారు.
