Begin typing your search above and press return to search.

షాకింగ్ ఇష్యూ... గబ్బిలాలతో స్పెషల్ చికెన్ ఐటమ్స్!

డానిష్ పేట పరిధిలోని కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని అటవీ కార్యాలయానికి సమాచారం అందటంతో... అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు.

By:  Raja Ch   |   28 July 2025 3:18 PM IST
షాకింగ్  ఇష్యూ... గబ్బిలాలతో స్పెషల్  చికెన్  ఐటమ్స్!
X

చైనాలో ప్రజలు గబ్బిలాలను తింటారని.. వాటితో సూపు చేసుకుని తాగుతారని.. ఇంకా రకరకాల పక్షులు, క్షీరదాలు, కీటకాలతో తయారు చేసిన వంటకాలు తింటారనే సంగతి తెలిసిందే! ఈ విషయం తెలిసినవారు... బాబోయ్, అలా ఎలా తింటారండీ? అని ప్రశ్నించేవారు! అయితే... తెలియకుండా మనదేశంలోనూ వాటిని తినేస్తున్నారంట.. ఈ మేరకు ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఫాస్ట్‌ ఫుడ్‌ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే విషయం.. పచ్చికారం తినకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగే విషయం.. ప్రధానంగా మాంసహార ప్రియులు బయట ఫుడ్ తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గబ్బిలాలతో తయారు చేసిన చిల్లీ చికెన్‌ ను అమ్ముతున్న ఓ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరు సమీపంలోగల డానిష్‌ పేట అటవీ ప్రాంతంలో గబ్బిలాలను చంపి, వాటిని వండి, చిల్లీ చికెన్‌ గా అమ్ముతున్నట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గబ్బిలాల మాంసాన్ని చిల్లీ చికెన్, చికెన్ పకోడీ అని స్ట్రీట్ ఫుడ్ దుకాణాల్లో అమ్ముతున్నారని అంటున్నారు.

డానిష్ పేట పరిధిలోని కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని అటవీ కార్యాలయానికి సమాచారం అందటంతో... అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఈ క్రమంలో నిజంగానే అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో, ఆ ప్రాంతం మొత్తం గాలించారు. ఈ క్రమంలోనే కమల్, సెల్వం అనే ఇద్దరు వ్యక్తులు కన్పించారు!

దీంతో... ఇద్దరిని పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. ఈ సమయంలో... కొన్ని నెలలుగా వీళ్లిద్దరూ గబ్బిలాలను వేటాడుతూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్‌ పేరిట హోటల్స్‌ కు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు తేలిందని.. కొన్ని హోటల్స్‌ కు వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండి మరీ చేరవేస్తున్నారని తేలిందని అంటున్నారు!

ఈ సమయంలో అధికారులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో... సేలం, కమల్‌ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లపై పోలీసులు తనిఖీలు చేపట్టారని సమాచారం!

ఈ విధంగా... గబ్బిలాలతో చికెన్ ఐటమ్స్ అనే విషయం వెలుగులోకి రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని అంటున్నారు. గబ్బిలాలతో ప్రమాదకరమైన వైరస్‌ లు సోకుతాయని చెబుతున్న వేళ... ఏకంగా వాటితోనే రకరకాల వంటకాలు తయారు చేయడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా... దీనిపై లోతైన విచారణ జరగాలని, ఈ పనులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.