వసంత పంచమి: విద్యాభ్యాసం చేయిస్తున్నారా.. జర ఆలోచించండి!
హిందూ పంచాంగం ప్రకారం.. మాఘమాసం శుక్లపక్షం పంచమి తిధి రోజు జరుపుకునే పవిత్రమైన రోజునే వసంత పంచమి అని అంటారు.
By: Madhu Reddy | 18 Jan 2026 3:00 PM ISTహిందూ పంచాంగం ప్రకారం.. మాఘమాసం శుక్లపక్షం పంచమి తిధి రోజు జరుపుకునే పవిత్రమైన రోజునే వసంత పంచమి అని అంటారు. అయితే ఈ సంవత్సరం జనవరి 23వ తేదీన వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈరోజు నుంచే వసంత రుతువు ప్రారంభం అవుతుందని, సరస్వతి దేవి అవతరించారని ప్రజలు విశ్వసిస్తారు. ముఖ్యంగా సరస్వతీ దేవి అవతరించిన రోజు కావడంతో విద్యార్థులు, కళాకారులు , సాహిత్యం, సంగీతం, జ్ఞానంతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఇది చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.
ఇకపోతే వసంత పంచమి వచ్చిందంటే చాలు ఆ రోజున తమ పిల్లల చేత విద్యాభ్యాసం చేయించడానికి ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి వసంత పంచమి రోజు మీరు మీ పిల్లలకు విద్యాభ్యాసం చేయించాలి అంటే కొంచెం ఆలోచించండి అని చెబుతున్నారు పంచాంగ నిపుణులు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హిందూ పంచాంగం ప్రకారం.. 2026 ప్రారంభంలోనే శుక్ర మౌడ్యమి ఉంది. ఇది ఫిబ్రవరి 17 2026 వరకు కొనసాగుతుంది. సాధారణంగా మౌడ్యమి ఉన్నప్పుడు అక్షరాభ్యాసం వంటి శుభకార్యాలు చేయరు. కానీ వసంత పంచమి (జనవరి 23) వంటి విశేష పర్వదినాలలో మాత్రం కొంతమంది ముహూర్తం లేకుండానే తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా మౌడ్యమి సమయంలో వసంత పంచమి వచ్చింది కాబట్టి సాంప్రదాయాన్ని బట్టి పండితులను సంప్రదించడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా మీ పిల్లల చేత ఈ వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించాలని అనుకుంటున్నట్లయితే ఒకసారి పండితులను సంప్రదించి, ఆ తర్వాత విద్యాభ్యాసం చేయిస్తే మంచిది.
ఒకవేళ మీరు ఈ వసంత పంచమి రోజున మీ పిల్లల చేత విద్యాభ్యాసం చేయించలేకపోతే మాఘశుద్ధ విదియ అనగా ఫిబ్రవరి 20 శుక్రవారం రోజున మౌడ్యమి తర్వాత వచ్చే మొదటి శ్రేష్టమైన రోజు. కాబట్టి ఈరోజున మీరు మీ పిల్లలు చేత విద్యాభ్యాసం చేయించవచ్చు. ఇక అలాగే మరో ముఖ్యమైన రోజుల విషయానికి వస్తే.. గురుపౌర్ణమి జూలై 29 బుధవారం అలాగే విజయదశమి అక్టోబర్ 20 మంగళవారం పిల్లల విద్యాభ్యాసానికి శ్రేష్టమైన రోజులుగా పండితులు చెబుతున్నారు.
ఇకపోతే ఈ విద్యాభ్యాసం చేసేటప్పుడు పిల్లల వయసు ముఖ్యంగా రెండున్నర నుండి ఐదు సంవత్సరాల మధ్య ఉండి తీరాలి. అశ్విని, పునర్వసు, హస్త, చిత్త, పుష్యమి, స్వాతి, శ్రవణం, రేవతి వంటి నక్షత్రాలను బట్టి సోమ, బుధ, గురు, శుక్రవారాలలో అలాగే మీ పిల్లలు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఖచ్చితమైన లగ్నం నిర్ణయించుకొని ఆ తర్వాత విద్యాభ్యాసం చేయిస్తే వారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని పండితులు కూడా సూచిస్తున్నారు.
ఇక ఈ వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజించడానికి ఉదయం 06:43 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు చాలా ఉత్తమమైన సమయం. ఇక వసంత పంచమి పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిధి జనవరి 22 గురువారం అర్ధరాత్రి 01:44 గంటలకు ప్రారంభమై జనవరి 23 శుక్రవారం అర్ధరాత్రి 12:37 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిధి ప్రకారం జనవరి 23 శుక్రవారం వసంత పంచమి జరుపుకుంటారు.
ఈ వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే.. ప్రపంచం ప్రారంభ దశలో నిస్తేజంగా, మౌనంగా ,నిశ్శబ్దంగా ఉందని నమ్ముతారు. బ్రహ్మదేవుడు సృష్టితో సంతృప్తి చెందలేదట. అప్పుడు తన కమండలం నుంచి నీటిని చల్లగా దీని నుంచి సరస్వతి దేవి ఆవిర్భవించింది. అమ్మ వీణతో మధురమైన స్వరం పలికారు. దీని వల్లే ప్రపంచానికి స్వరం, ధ్వని లభించాయి.అప్పటినుంచి వసంత పంచమి రోజునే సరస్వతి దేవిని పూజించే ఆచారం మొదలైంది అని ప్రముఖ పండితులు చెప్పుకొస్తున్నారు.
