తల్లి మళ్లీ పెళ్లి చేసుకుందని కొడుకు సూసైడ్
తాజాగా తల్లి.. కొడుకుల మధ్య ఈ విషయంపై వాదన జరిగింది. అది కాస్తా గొడవగా మారింది. అనంతరం అన్న ఆషితో కలిసి అబ్బాస్ బహిర్భూమికి వెళ్లాడు.
By: Garuda Media | 13 Dec 2025 3:24 PM ISTఅయ్యో అనిపించే ఉదంతం ఏపీలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి నిర్ణయాన్ని కొడుకు జీర్ణించుకోలేకపోవటం ఈ ఉదంతంలో కనిపిస్తుంది. అంతేకాదు.. తల్లి తీసుకున్న నిర్ణయాన్ని కొడుకు సరైన రీతిలో అర్థం చేసుకోలేదన్నది అర్థమవుతుంది. తన తండ్రి మరణించిన నాలుగేళ్లకు తల్లి మరొకరిని వివాహం చేసుకున్న వైనం నచ్చని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. బాపట్లకు చెందిన ఒక కుటుంబానికి చెందిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..
బాపట్ల పట్టణానికి చెందిన మున్నీ కుటుంబం మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి పదేళ్ల క్రితం వెళ్లింది. కుటుంబ పెద్ద అంజాద్ బాషాతో మున్నీకి ముప్ఫై ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం అంజాద్ బాషా అనారోగ్యంతో మరణించారు. తాజాగా మున్నీ మరొకరిని వివాహమాడింది. అయితే.. తల్లి నిర్ణయాన్ని జీర్ణించుకోలేని అబ్బాస్ (24) ఆమెను తప్పు పట్టేవారు.
తాజాగా తల్లి.. కొడుకుల మధ్య ఈ విషయంపై వాదన జరిగింది. అది కాస్తా గొడవగా మారింది. అనంతరం అన్న ఆషితో కలిసి అబ్బాస్ బహిర్భూమికి వెళ్లాడు. పెళ్లి విషయంలో తల్లి తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకోలేని అబ్బాస్.. అక్కడే ఉన్న బావిలోకి దూకేశాడు. దీంతో.. షాక్ తిన్న ఆషికి.. ఊళ్లోకి పరుగు తీసి అక్కడి వారికి జరిగింది చెప్పాడు. దీంతో వారు వెళ్లి.. డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టు మార్టం కోసం ఎయిమ్స్ కు పంపిన పోలీసులు కేసు నమోదు చేసుకొన విచారిస్తున్నారు.
