Begin typing your search above and press return to search.

వెలుగులోకి మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నులకు పైగా..

రాజస్థాన్ లో గిరిజనుల ఎక్కువగా ఉండే బన్స్వార జిల్లాలో మరోసారి బంగారు నిల్వలను కనుగొనడంతో ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది.

By:  Madhu Reddy   |   25 Oct 2025 4:46 PM IST
వెలుగులోకి మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నులకు పైగా..
X

రాజస్థాన్ లో గిరిజనుల ఎక్కువగా ఉండే బన్స్వార జిల్లాలో మరోసారి బంగారు నిల్వలను కనుగొనడంతో ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఘటోల్ తహసీల్ లోని కంకారియా గ్రామంలో మూడో బంగారు గని ఉందని అధికారులు నిర్ధారించారు. భారతదేశం కొత్త బంగారు రాజధానిగా బన్స్వార ఆవిర్భవించిందని నిపుణులు అంటున్నారు. భూకియా , జగ్ పురా తర్వాత ఈ ప్రాంతంలో బంగారు బేరింగ్ జోన్ గా అంచనా వేయబడిన మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారు ఖనిజం విస్తరించి ఉందని భౌగోళిక సర్వేలు బలమైన ఆధారాలతో వెల్లడించారు.

జియాలజికల్ డిపార్ట్మెంట్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాథమిక అంచనాల ప్రకారం చూసుకుంటే 940.26 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ గనిలో సుమారుగా 113.52 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం, 222.39 టన్నుల స్వచ్ఛమైన బంగారం ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటివరకు రాజస్తాన్ లో గుర్తించబడిన అతిపెద్ద బంగారు నిక్షేపాలలో ఇది ఒకటి. అయితే ఇప్పుడు తాజాగా అదనంగా కంకారియా- గారా ప్రాంతాలలో 205 హెక్టార్లలో 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉంటుందని అంచనా వేశారు. కేవలం బంగారమే కాదు అనేక విలువైన సహ ఖనిజాలు కూడా ఇక్కడ బయటపడే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా గతంలో రాజస్థాన్ ప్రభుత్వం భూకియా జగ్ పురా మైనింగ్ బ్లాక్ లను వేలం వేసింది. కానీ ఇక్కడ వేలంలో గెలిచిన సంస్థలు డిపాజిట్ చేయడంలో విఫలం అవ్వడం వల్ల వారి లైసెన్స్ రద్దు చేశారు. కానీ ఇప్పుడు కొత్త టెండర్లు జారీ చేయబడ్డాయి. అక్టోబర్ 14న టెండర్లు ముగిశాయి. నవంబర్ 3న బిడ్ లు తెరవబోతున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి అత్యధిక ఆదాయ వాటాను అందించే కంపెనీకి ఈ మైనింగ్ లైసెన్స్ ను ఇవ్వబోతున్నారు. ఇక్కడ పనులు ప్రారంభమైన తర్వాత రాజస్థాన్ రాష్ట్రం బంగారం తవ్వకాలలో పాల్గొని అతి కొద్ది రాష్ట్రాల లిస్టులో చేరుతుంది. ఇది దేశం యొక్క బంగారు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశానికి కావలసిన మొత్తం బంగారం డిమాండ్ లో ఈ ఒక్క జిల్లా నుండే దాదాపు 25 శాతం బంగారాన్ని సరఫరా చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ అభివృద్ధి పెట్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, ఆటో కాంపోనెంట్స్ వంటి రంగాలలో ప్రధాన పెట్టుబడులను ఆకర్షిస్తుందని, స్థానిక యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని అలాగే బన్స్వారా రాజస్థాన్ యొక్క కీలకమైన పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.