Begin typing your search above and press return to search.

మినిమం బ్యాలెన్స్ లేదన్న పేరుతో లాగేసింది రూ.19 వేల కోట్లు!

ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తాం. మీకున్న బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్సుకు సంబంధించిన ఒక రూల్ ఉంటుంది.

By:  Garuda Media   |   11 March 2026 9:57 AM IST
మినిమం బ్యాలెన్స్ లేదన్న పేరుతో లాగేసింది రూ.19 వేల కోట్లు!
X

బ్యాంకుల ముచ్చట చెప్పే ముందు మిమ్మల్ని ఓ రెండు.. మూడు ప్రశ్నలు సూటిగా అడగాలి. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళితే.. విషయం మరింత బాగా మీకు అర్థమవుతుంది. అందులో మొదటిది.. మీరో ఏటీఎంకు వెళ్లి.. మీ ఖాతాలో ఉన్న డబ్బుల్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. కొన్నిసార్లు ఏటీఎంలో డబ్బులు లేవని చెబుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఊసురుమంటూ మరో ఏటీఎంకు వెళతారు. రెండో అంశం.. డబ్బులు డ్రా చేసుకోవటానికి ఏటీఎంకు వెళ్లి.. ఐదారుసార్లు డబ్బులు డ్రా చేసుకున్నారు. బ్యాంక్ విధించిన పరిమితికి మించి డబ్బులు డ్రా చేసినందుకు ఛార్జ్ వేస్తారా? మూడో విషయం. మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకునే వేళలో.. సేవలు అందించే విషయంలో ఫెయిల్ అయ్యే బ్యాంకులు ఎలాంటి రుసుము చెల్లించదు. మరి.. అదే బ్యాంకులు చెప్పిన పరిమితి దాటితే డబ్బులు వసూలు చేస్తాయి? ఇందులో న్యాయం కనిపిస్తుందా?

ఆ మాటకు వస్తే.. పలు ప్రైవేటు బ్యాంకులు చెప్పే నిబంధనలు వింటున్నప్పుడు ఒళ్లు మండిపోతుంది. అదే సమయంలో మీ అకౌంట్ లో ఉన్న డబ్బుల్లో నుంచి రూ.2 లక్షలు క్యాష్ కావాలంటే.. మీరు ఒక రోజు ముందు చెప్పాలి? రెండు మూడు గంటల ముందు చెప్పటం కానీ.. కాస్త వెయిట్ చేస్తే ఇస్తామని చెబుతారు. అదే మీరు మీ చెక్కు వేసి.. మీ ఖాతాలో డబ్బులు లేవు.. నాలుగు గంటలు ఆగితే డబ్బులు వేస్తామని చెబితే బ్యాంకులు ఊరుకుంటాయా? ఇదంతా చూసినప్పుడు ఒకేలాంటి అంశాలకు బ్యాంకుల తీరు ఒకలా.. వినియోగదారుడి తీరు మరోలా ఉంటుంది. దీన్ని ప్రశ్నించే తీరు వినియోగదారుల్లో కనిపించదు.

ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తాం. మీకున్న బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్సుకు సంబంధించిన ఒక రూల్ ఉంటుంది. ఆ మొత్తాన్ని మీరు మొయింటైన్ చేయకపోతే.. వారు కొంత ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. ఆ మొత్తం చూసేందుకు కాస్త తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ.. రెండేళ్ల వ్యవధిలో (2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో తగినంత నగదు నిల్వల్నిఉంచని కారణంగా వారి నుంచి వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.11 వేల కోట్లు.

ఈ విషయాన్ని తాజాగా పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. చూసేందుకు చిన్న మొత్తంగా కనిపించినా.. ప్రైవేటు బ్యాంకులు నిబంధనల పేరుతో వసూలు చేసే మొత్తాలు ఎంత భారీగా ఉంటాయనే దానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక్క ప్రైవేటు బ్యాంకులు మాత్రమే కాదు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తక్కువేం తినలేదు. ఖాతాదారులు తమ ఖాతాల్లో తగినంత నగదు నిల్వల్ని ఉంచని కారణంగా రెండు సంవత్సరాల వ్యవధిలో వసూలు చేసిన మొత్తం రూ.8వేల కోట్లుగా పేర్కొన్నారు. అంటే.. ప్రైవేటు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి ఏకంగా రూ.19వేల కోట్లు తమ ఖాతాదారుల నుంచి వసూలు చేసినట్లుగా చెప్పాలి.

ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అత్యధికంగా రూ.3800 కోట్లు చార్జీల రూపంలో లాగేస్తే.. తర్వాతి స్థానం యాక్సిస్ బ్యాంక్ రూ.2700 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంకు రూ.1200 కోట్లతో నిలిచింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు అత్యధికంగా రూ.1500 కోట్లు వసూలు చేస్తే.. తర్వాతి స్థానం బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1200 కోట్లతో నిలిచింది. ఇండియన్ బ్యాంక్ రూ.1100కోట్లు వసూలు చేసినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ మాత్రం 2020 నుంచి తమ ఖాతాదారులు వారి ఖాతాల్లో కనీస మొత్తాన్ని మొయింటైన్ చేయని కారణంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదు. ఎస్ బీఐ మాదిరి పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కెనరా బ్యాంకులు కూడా ఈ తరహా ఛార్జీలను 2025 నుంచి తొలగించినట్లుగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఎలాంటి మొహాటం లేకుండా కనీస నిల్వలు లేకపోతే.. ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. తాము చెప్పినట్లుగా వ్యవహరించని వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు బ్యాంకులు.. తమ ఖాతాదారులు ఏటీఎంలకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేసుకున్న సమయంలో డబ్బులు లేవన్న దానికి ఎందుకు బాధ్యత వహించదు? ఆ విషయంలో ఆర్ బీఐ ఎందుకు జోక్యం చేసుకోదు? ఖాతాదారుల పక్షాన ఎందుకు నిలవకూడదు? అన్నది ప్రశ్న. రానున్న రోజుల్లో అయినా ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుందేమో చూడాలి.