Begin typing your search above and press return to search.

పన్ను వసూళ్ల లెక్క చెప్పిన బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెర్చ్

భారతదేశ జనాభా.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ అంతరం తగ్గుతుందని ఈ రిపోర్టు అంచనా వేసింది.

By:  Garuda Media   |   25 Jan 2026 5:00 PM IST
పన్ను వసూళ్ల లెక్క చెప్పిన బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెర్చ్
X

దేశం ఏదైనా.. దాని ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసేందుకు పన్ను ఆదాయం కీలకభూమిక పోషిస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి పలు దేశాలతో భారత్ లో వసూలవుతున్న పన్నులను పోల్చిన ఒక పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. పన్ను వసూళ్ల విషయంలో పలు డెవలప్ మెంట్ దేశాల్ని భారత్ వెనక్కి నెట్టినట్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించిన రీసెర్చ్ లో గుర్తించారు. స్థూల దేశీయోత్పత్తి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్నుల ఆదాయ నిష్పత్తి ప్రస్తుతం 19.6 శాతానికి చేరినట్లుగా గుర్తించారు.

పలు దేశాలతో పోలిస్తే మన దేశంలో పన్ను వసూళ్లు బాగున్నప్పటికి.. మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పన్నుల వసూళ్లు పెరగటంలో కీలక భూమిక ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలేనని రిపోర్టు స్పష్టం చేస్తోంది. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేయటంతో పాటు.. జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయటం.. డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించటంతో పన్ను వసూళ్లు పెరిగినట్లుగా తేల్చారు

రానున్న రోజుల్లో పన్ను వసూళ్లు మరింత పెరగటం ఖాయమని రిపోర్టు చెబుతోంది. అంతేకాదు 2026 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న నూతన ఆదాయ పన్ను చట్టం దేశ పన్నుల చరిత్రలో కీలక మలుపుగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గతంతో పోలిస్తే పన్ను వసూళ్లలో పురోగతి సాధించినప్పటికి.. డెవలప్ మెంట్ దేశాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడి ఉందని చెప్పినా.. పలు ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉందన్న విషయాన్ని వెల్లడించింది.

యూరోప్ లోని జర్మనీలో ట్యాక్స్ టు జీడీపీ రేషియో ఏకంగా 38 శాతం ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలో 25.6 శాతంగా ఉంది. వీటితో పోలిస్తే భారత్ లో 19.6 శాతంగా ఉన్నట్లుగా రిపోర్టు పేర్కొంది. భారతదేశ జనాభా.. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ అంతరం తగ్గుతుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. అదే సమయంలో ఆసియాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా పేర్కొనే హాంకాంగ్.. మలేషియా.. ఇండోనేషియా లాంటి వర్ధమాన దేశాలతో పోలిస్తే పన్ను వసూళ్లలో భారత్ మెరుగైన పని తీరు కనబరుస్తుందని చెబుతున్నారు.

ఆసియాలోని వర్ధమాన మార్కెట్లుగా చెప్పే హాంకాంగ్ లో పన్నువసూళ్లు 13.1 శాతంగా ఉంటే.. మలేషియాలోనూ 13.1 శాతం.. ఇండోనేషియాలో 12 శాతంతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలో ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. కరోనా వేళ పన్నుల ఆదాయం తగ్గినప్పటికీ.. ఆ తర్వాత భారత్ ఊహించిన దాని కంటే మిన్నగా పుంజుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఆర్థికంగా భారత్ మెరుగైన పని తీరును ప్రదర్శిస్తుందని మాత్రం చెప్పకతప్పదు. నిజానికి పన్ను వసూళ్లను మరింత సరళీకరిస్తే.. పన్ను రాబడులు మరింత పెరుగుతాయన్న మరో వాదన ఉంది. మరి.. దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.