Begin typing your search above and press return to search.

బ్యాంకులు అయిదు రోజులే...ఓకే అంటారా ?

తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదని జాప్యం చేస్తోంది అని బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి తొమ్మిది సంఘాల ఐక్యవేదిక యూఎఫ్ బీఏ నేతలు అంటున్నారు.

By:  Satya P   |   25 Jan 2026 9:31 AM IST
బ్యాంకులు అయిదు రోజులే...ఓకే అంటారా ?
X

బ్యాంకింగ్ రంగం అంటే చిన్నా పెద్దా అందరూ ఆధారపడే కీలక రంగం. ఈ రోజున అతి సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా అందరికీ బ్యాంకులతో లావాదేవీలతో ఎంతో సంబంధం ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే బ్యాంకులు నెలలో ఆరు రోజులు సెలవులు తీసుకుంటూ 24 రోజులు పని చేస్తున్నాయి. మొదటి మూడవ శనివారాలు సెలవుగా ఉంటోంది. అలాగే నాలుగు ఆదివారాలు కూడా సెలవు. అయితే ఈ 24 రోజులను కూడా 20 రోజులు చేయమని ఆ పని దినాలే ఖాయం చేయమని బ్యాంకింగ్ యూనియన్లు కోరుతున్నాయి. దాని కోసమే సమ్మెకి కూడా దిగాయి.

గట్టిగానే సమ్మె :

తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27 న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకింగ్ సెక్టార్ పిలుపు ఇచ్చింది. వారానికి అయిదు పని దినాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్ తో పాటు మిగిలిన డిమాండ్లను కూడా జత చేర్చి ఈ సమ్మెకు బ్యాంక్ ఉద్యోగులు దిగుతున్నారు. దీంతో వరుసబెట్టి బ్యాంకుల మూతతో సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు అన్నది ఒకటైతే రెండవది వారి ప్రధాన డిమాండ్ మీద సాగుతున్న చర్చ కూడా ఉంది.

ప్రభుత్వం జాప్యం అంటూ :

తమ డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదని జాప్యం చేస్తోంది అని బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి తొమ్మిది సంఘాల ఐక్యవేదిక యూఎఫ్ బీఏ నేతలు అంటున్నారు. ఇక మీదట నెలలో వచ్చే అన్ని శనివారాలు సెలవుగా ప్రకటించాలని వారంలో అయిదు రోజులు పని దినాలుగా చేయాలని తొమ్మిది బ్యాంకు సంఘాల ఉమ్మడి వేదిక అయిన యూఎఫ్ బీయూ డిమాండ్ చేస్తోంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్-1947 ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ చీఫ్ లేబర్ కమిషనర్, ఆర్థిక సేవల విభాగానికి దేశ వ్యాప్తంగా తాము ఒక రోజు సమ్మె చేస్తున్నట్లుగా నోటీసు పంపింది.

సిఫార్సు చేసినా :

ఇక తమ ప్రతిపాదన పట్ల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ సానుకూలంగా స్పందించి ఆమోదించిందని దానిని ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేసిందని తొమ్మిది సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక యూఎఫ్ బీఏ నేతలు చెబుతున్నారు. ఇది జరిగింది 2023 డిసెంబర్ 7వ తేదీ అయితే నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎటూ తేల్చక జాప్యం చేస్తోనని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అయిదు పని దినాలకు బ్యాంకింగ్ సేవలు తగ్గించినా ప్రతీ రోజూ మరో నలభై నిముషాల పాటు బ్యాంక్ పనివేళలను పెంచేందుకు యూనియన్లు అంగీకరిస్తున్నాయి. అయితే వారంలో అయిదు రోజులే పని దినాలు అంటే అందరికీ ఇబ్బంది కదా అన్న అంశంలోనే ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మె అయితే 27న గట్టిగానే జరగనుంది.