మళ్లీ ఘోరం... బంగ్లాలో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు!
నివేదికల ప్రకారం... సామ్రాట్ అనే వ్యక్తి గత ఏడాది షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశం విడిచి పారిపోయి, ఇటీవల కలిమోహోర్ యూనియన్ లోని తన గ్రామం హోసెండంగాకు తిరిగి వచ్చాడు.
By: Raja Ch | 26 Dec 2025 12:21 AM ISTగత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే... షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణానంతరం బంగ్లాదేశ్ లో అంతర్లీనంగా అశాంతి పెద్ద ఎత్తున ఆక్రమించింది. ఈ నేపథ్యంలో దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని అరాచక ముఠా ఒకటి కొట్టి చంపింది. అతని మృతదేహాన్ని చెట్టుకు కాల్చి నిప్పి పెట్టింది. ఈ ఘటనను యావత్ భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో మరో హిందూని కొట్టి చంపారు.
అవును... బంగ్లాదేశ్ లో అరాచక ముఠా దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని కొట్టి చంపిన కొన్ని రోజుల తర్వాత మరో ఘోరం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపినట్లు గురువారం స్థానిక మీడియా నివేదించింది. బాదితుడిని అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి దాడి జరగ్గా.. గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు చెబుతున్నారు.
నివేదికల ప్రకారం... సామ్రాట్ అనే వ్యక్తి గత ఏడాది షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశం విడిచి పారిపోయి, ఇటీవల కలిమోహోర్ యూనియన్ లోని తన గ్రామం హోసెండంగాకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో.. అతను, అతని బ్యాచ్ లోని కొంతమంది సభ్యులు గ్రామస్థుడు షాహిదుల్ ఇస్లాం ఇంటికి వెళ్లి డబ్బు వసూలు చేశారని అంటున్నారు. ఈ సమయంలో.. కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారని చెబుతున్నారు.
ఈ క్రమంలో.. వారంతా... దొంగ దొంగ అని అరవడం ప్రారంభించారని.. దీంతో ఇతర గ్రామస్తులు రావడంతో ఆ బ్యాచ్ సభ్యులు మొత్తం పారిపోయారని.. అయితే, సామ్రాట్ మాత్రం వారికి దొరికిపోయాడని చెబుతున్నారు. దీంతో అతన్ని పట్టుకున్న గ్రామస్థులు తీవ్రంగా కొట్టారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన పాంగ్షా సర్కిల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ దేబ్రత్ సర్కార్ మాట్లాడుతూ... పోలీసులు సామ్రాట్ ను ఆ గుంపు నుంచి రక్షించారని.. అనంతరం ఆసుపత్రికి తరలించారని, అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో మృతి చెందాడని తెలిపారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే సామ్రాట్ పై పాంగ్షా స్టేషన్ లో రెండు కేసులు ఉన్నాయని.. వాటిలో ఒకటి హత్య కేసు అని తెలిపారు.
కాగా... గత గురువారం ఢాకాకు సుమారు మూడు గంటల దూరంలో ఉన్న మైమెన్ సింగ్ లో 25 ఏళ్ల చంద్రదాస్ పై ఓ సహోద్యోగి దైవదూషణ ఆరోపణలు చేయడంతో.. ఓ గుంపు అతన్ని కొట్టి చంపిన సంగతి తెలిసిందే. అనంతరం.. అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పు పెట్టింది. ఈ ఘటనపై భారత్ లోని వివిధ ప్రదేశాల్లో నిరసనలు చెలరేగాయి. అయితే.. దాస్ దైవ దూషణకు పాల్పడ్డాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.
