Begin typing your search above and press return to search.

బంగ్లాలో హిందూ వ్యక్తి హత్య... వెలుగులోకి మరో షాకింగ్ విషయం!

వివరాళ్లోకి వెళ్తే... హత్యకు ముందు దీపూ చంద్రదాస్ పోలీసులతో మాట్లాడుతూ.. తాను ఏ మతాన్ని అవమానించలేదని.. దేవుడు ఒక్కడే కానీ పేర్లు వేరు అని మాత్రమే అన్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Raja Ch   |   20 Dec 2025 11:11 PM IST
బంగ్లాలో హిందూ వ్యక్తి  హత్య... వెలుగులోకి మరో షాకింగ్  విషయం!
X

ఇటీవల బంగ్లాదేశ్ లో నెలకొన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో పాతికేళ్ల దీపూ చంద్రదాస్ అనే హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఆందోళనకారులు కొట్టి చంపేశారు. అతని మృతదేహాన్ని చెట్టుకుని కట్టి, దానిపై కిరోసిన్ పోసి, నిప్పటించారు! ఈ ఘటన పెద్ద ఎత్తున విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇందులో పోలీసు పాత్రపై మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ లో తీవ్రవాద మూక చేతిలో హత్యకు గురైన హిందూ మతానికి చెందిన దీపూ చంద్రదాస్ అనే వ్యక్తి హత్యకు ముందు జరిగిన ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇతడు హత్యకు గురయ్యే ముందు పోలీసు యూనిఫాం ధరించిన కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ సమయంలో తస్లీమా నస్రీన్ ఈ హత్య వెనుక ఉన్న సంఘటనల క్రమాన్ని పంచుకుంటూ ప్రశ్నించారు.

వివరాళ్లోకి వెళ్తే... హత్యకు ముందు దీపూ చంద్రదాస్ పోలీసులతో మాట్లాడుతూ.. తాను ఏ మతాన్ని అవమానించలేదని.. దేవుడు ఒక్కడే కానీ పేర్లు వేరు అని మాత్రమే అన్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమయంలో.. లైంగిక వేధింపులు, మతపరమైన అణచివేతతో తన బాల్య అనుభవాలను వివరించే ఆత్మకథ "అమర్ మెయెబెలా" ద్వారా ప్రసిద్ధి చెందిన బహిష్కృత బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ "ఎక్స్" వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా... దీపు చంద్రదాస్ మైమెన్సింగ్ లోని భలూకాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడని.. అతను ఓ పేద కార్మికుడని.. ఒక రోజు ఒక ముస్లిం సహోద్యోగి అతన్ని ఏదో చిన్న విషయంలో శిక్షించాలని అనుకున్నాడని.. ఈ నేపథ్యంలోనే ప్రవక్త గురించి దీపూ అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడంటూ జనసమూహం మధ్యలో ప్రకటించాడని.. అది విన్న ఉన్మాదులైన ప్రవక్త అనుచరులు దీపుపై హైనాల మాదిరిగా దాడి చేసి, ముక్కలు ముక్కలు చేయడం ప్రారంభించాడని తస్లిమా తెలిపారు.

ఈ సమయంలో అది గమనించిన పోలీసులు అతన్ని రక్షించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అంటే ఆ క్షణం అనంతర్మ దీపు పోలీసు రక్షణలోనే ఉన్నాడని తెలిపారు. ఈ సమయంలో పోలీసులకు దీపు జరిగిన విషయాన్ని చెప్పాడని.. ఇందులో భాగంగా.. తాను నిర్దోషినని, ప్రవక్త గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఇదంతా ఆ సహోద్యోగి పన్నిన కుట్ర అని చెప్పాడని వెల్లడించారు. అయినప్పటికీ పోలీసులు ఆ సహోద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం చేయలేదని తస్లిమా ఎత్తి చూపారు.

ఈ సందర్భంగా పోలీసుల పాత్రను ప్రశ్నించిన తస్లిమా... ఈ జీహాదీ ఉత్సహం మితిమీరిన కారణంగానే పోలీసులు దీపును ఆ మతోన్మాదులకు తిరిగి ఇచ్చరా..? లేక, జీహాదీ ఉగ్రవాదులే పోలీసులను పక్కకు నెట్టి దీపును స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారా..? ఏది ఏమైనా.. వారు దీపుని కొట్టి, ఉరి తీసి, దహనం చేస్తూ.. పూర్తిస్థాయిలో వేడుకలు నిర్వహించారు.. జీహాదీ పండుగ అంటూ తస్లిమా నస్రీన్ రాసుకొచ్చారు! భారత్ పారిపోవడానికి సైతం దీపు కుటుంబం వద్ద డబ్బులు లేవని తెలిపారు.