Begin typing your search above and press return to search.

మాజీ కేంద్ర మంత్రికి ఆస్పత్రిలోనూ సంకెళ్లు.. ఏం జరిగింది?

షేక్ హసీనా ప్రభుత్వంలో బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన 75 ఏళ్ల నూరుల్ మజీద్ మహమూద్ హుమాయున్.. ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

By:  Raja Ch   |   3 Oct 2025 12:00 AM IST
మాజీ కేంద్ర మంత్రికి ఆస్పత్రిలోనూ సంకెళ్లు.. ఏం జరిగింది?
X

రాజకీయాల్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయనే సంగతి తెలిసిందే! అన్ని చోట్లా ఈ తరహా ప్రక్రియ జరుగుతుంది కానీ.. అది రాజకీయాల్లో మరింత ఎక్కువగా ఉంటుందని అంటారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితుడు, మాజీ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నూరుల్ మాజిద్ మహమూద్ హుమాయున్ మృతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది.

అవును... అవామీ లీగ్ సీనియర్ నాయకుడు నూరుల్ మాజిద్ మరణం తర్వాత బంగ్లాదేశ్‌ లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శలకు గురవుతోంది. షేక్ హసీనా ప్రభుత్వంలో బంగ్లాదేశ్ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన 75 ఏళ్ల నూరుల్ మజీద్ మహమూద్ హుమాయున్.. ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

అయితే.. హుమాయున్‌ ను ఆసుపత్రిలో చికిత్స సమయంలో మంచానికి కట్టివేసినట్లున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. ఈ వ్యవహారాన్ని మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి చేతికి హ్యాండ్‌ కప్స్‌ బిగించి చికిత్స చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంపై అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంపై అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా... ఈ చిత్రాలు అతను ఆసుపత్రిలో చేరిన తొలి దశ నాటివని జైలు అధికారులు నొక్కి చెబుతున్నారు. ప్రతి ఖైదీ మానవ హక్కులు, గౌరవాన్ని కాపాడటానికి తాము ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు.

అయితే.. చనిపోతున్న లేదా చనిపోయిన వ్యక్తి చేతికి సంకెళ్లు వేయడం అమానుషం, మానవ హక్కుల ఉల్లంఘన అని.. ఇది అత్యంత తీవ్రంగా అవమానించడమేనని.. సదరు వ్యక్తి గౌరవ ఉల్లంఘనకు ఉదాహరణగా మిగిలిపోతుందని మానవ హక్కుల కార్యకర్త నూర్ ఖాన్ లిటన్ అన్నారు. ఈ చర్య ఏమాత్రం సమర్ధనీయం, క్షమార్హం కాదని తెలిపారు.

కాగా... 2024 ఆగస్టులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పదవీచ్యుతులైన తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. నాడు జరిగిన నిరసనల సందర్భంగా హత్య, విధ్వంసక చర్యల కేసులకు సంబంధించి అరెస్టు అయినప్పటి నుండి హుమాయున్ జైలులోనే ఉన్నారు.