Begin typing your search above and press return to search.

హాదీ హత్య కేసు : భారత్-బంగ్లా సరిహద్దు వివాదంగా మారిన దర్యాప్తు

బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య కేసు ఇప్పుడు భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

By:  A.N.Kumar   |   28 Dec 2025 10:57 PM IST
హాదీ హత్య కేసు :  భారత్-బంగ్లా సరిహద్దు వివాదంగా మారిన దర్యాప్తు
X

బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య కేసు ఇప్పుడు భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన వివాదానికి కేంద్రబిందువుగా మారింది. నిందితులు భారత్ కు పారిపోయారని బంగ్లాదేశ్ ఆరోపిస్తుండగా.. ఆ వాదనలను భారత్ భద్రతా బలగాలు తీవ్రంగా ఖండించాయి.

సరిహద్దు వివాదంగా హాదీ హత్య కేసు

గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంగ్లాదేశ్ పోలీసులు.. దర్యాప్తులో భాగంగా తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు.

బంగ్లాదేశ్ పోలీసుల వాదన ఏమిటి?

ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ ఎస్ఎన్ నజ్రుల్ ఇస్లాం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన నిందితులైన ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ లు మేఘాలయ సరిహద్దు గుండా అక్రమంగా భారత్ లోకి ప్రవేశించారని ఆరోపించారు. భారత్ లో వీరికి ‘పూర్తి’ అనే వ్యక్తి ఆశ్రయం కల్పించాడని.. సామీ అనే ట్యాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయ లోని తురా నగరానికి చేరవేర్చాడని ఆరోపించారు. నిందితులకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను భారత పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని.. వారిని అప్పగించే విషయమై సంప్రదింపులు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు.

అవన్నీ కల్పిత కథలు అన్న భారత్

బంగ్లాదేశ్ చేసిన ఈ ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), మేఘాలయ పోలీసులు ముక్తకంఠంతో తోసిపుచ్చారు. సరిహద్దుల్లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉందని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దు దాటి నిందితులు భారత్ లోకి ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని.. బంగ్లాదేశ్ అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.

మేఘాలయ పోలీసులు కూడా ఈ అంశంపై మరింత ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్ మీడియా కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. అక్రమ చొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు. సరిహద్దు వెంబడి గస్తీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అనుమానిత కదలికలేవీ లేవని తేల్చిచెప్పారు.

దౌత్యపరమైన ఉత్కంఠ

ఒకవైపు బంగ్లాదేశ్ పోలీసులు తమ వద్ద పక్కా సమాచారం ఉందని చెబుతుండగా.. మరోవైపు భారత్ ఆ వాదనలను పూర్తిగా కొట్టిపారేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. నిందితులు నిజంగానే సరిహద్దు దాటారా? లేక దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నమా అనేది తేలాలంటే భారత్ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.