హసీనా ప్రత్యర్థి.. భారత్ ద్వేషి.. బంగ్లా బేగం ఖలీదా కన్నుమూత
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఒక శకం ముగిసింది. అంతర్గత సమస్యలు, అశాంతితో అట్టుడుకుతున్న ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By: Tupaki Political Desk | 30 Dec 2025 11:08 AM ISTపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఒక శకం ముగిసింది. అంతర్గత సమస్యలు, అశాంతితో అట్టుడుకుతున్న ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ లో మరో పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా (80) కన్నుమూశారు. షేక్ హసీనాకు చిరకాల ప్రత్యర్థి అయిన ఖలీదా జియా చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఉమ్మడి భారత దేశంలో 1945 ఆగస్టు 15న పుట్టిన ఈమె... 1991-96, 2001-06 మధ్య పదేళ్లు ఆ దేశ ప్రధానిగా పనిచేశారు. 2006 నుంచి బంగ్లా ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. షేక్ హసీనా 2006లో ప్రధాని అయ్యాక.. ఖలీదా జియాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2018-20 మధ్య జైలులో పెట్టారు. బంగ్లాలో కేర్ టేకర్ గవర్నమెంట్ ను ప్రవేశపెట్టింది ఈమెనే కావడం గమనార్హం. కాగా, వయసు రీత్యా అనారోగ్య సమస్యలు చుట్టిముట్టిన ఖలీదాను గత నెల 23న ఆస్పత్రిలో చేర్చారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండగా.. న్యుమోనియా కూడా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. డయాబెటిస్ కు తోడు కిడ్నీ, లివర్, లంగ్స్ పనితీరు దెబ్బతిన్నది. అప్పటినుంచి ఆస్పత్రిలోనే ఉన్న ఖలీదా మంగళవారం తుదిశ్వాస విడిచారు.
వ్యాపార కుటుంబం నుంచి..
ఖలీదా తండ్రి సికిందర్. వీరిది వ్యాపార కుటుంబం. బంగ్లా విమోచన యుద్ధంలో పాల్గొన్న జియాఉర్ రెహ్మాన్ ను 1960లోపెళ్లాడారు ఖలీదా. అప్పటి పాకిస్థాన్ పాలకులపై తిరుగుబాటు చేసిన జియాఉర్.. 1981లో హత్యకు గురయ్యారు. దీంతో బీఎన్పీ చీఫ్ గా ఖలీదా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఖలీదా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల కిందట దేశాన్ని వీడిన ఆయన తల్లి అనారోగ్యం రీత్యా బంగ్లాకు తిరిగొచ్చారు. రెండు సీట్ల నుంచి పోటీచేస్తున్నారు. ఖలీదాకు మరో కుమారుడు అరాఫత్ రెహ్మాన్ ఉన్నారు. ఆయన గతంలో మలేసియాలో చనిపోయారు.
హసీనాకు బద్ధ విరోధి.. భారత్ ద్వేషి
రెండు పెద్ద పార్టీలకు మహిళలే అధిపతులు ఉండడం బంగ్లాదేశ్ ప్రత్యేకత. అయితే, ఖలీదా జియా.. షేక్ హసీనా 40 ఏళ్లకు పైగా బంగ్లా రాజకీయాల్లో పరస్పర ప్రత్యర్థులు. అంతేకాదు.. భారత్ అంటే ఖలీదా ఇష్టం చూపేవారు కాదు. బద్ధ విరోధులైన వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికారంలో ఉండగా పరస్పరం ఇబ్బందులు పెట్టుకున్న చరిత్ర ఉంది. ఈ క్రమంలోనే 2018లో ఖలీదాను హసీనా జెల్లో పెట్టారు. ఇప్పుడు ఆమె మరణంతో బంగ్లా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.
