Begin typing your search above and press return to search.

భారత్ ముక్కలు అయితేనే బంగ్లాకు శాంతి....బంగ్లా ఆర్మీ మాజీ జనరల్ వ్యాఖ్య

బంగ్లాదేశ్ లో అశాంతి తగ్గేలా లేదు. అది తగ్గాలంటే భారత్ ముక్కలు కావడమే ఏకైక మార్గం అంతకు మించి పరిష్కారం లేదు అంటూ బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ ఆజ్మీ సంచలన వ్యాఖ్య చేశారు.

By:  Tupaki Political Desk   |   3 Dec 2025 9:00 PM IST
భారత్ ముక్కలు అయితేనే బంగ్లాకు శాంతి....బంగ్లా ఆర్మీ మాజీ జనరల్ వ్యాఖ్య
X

బంగ్లాదేశ్ లో అశాంతి తగ్గేలా లేదు. అది తగ్గాలంటే భారత్ ముక్కలు కావడమే ఏకైక మార్గం అంతకు మించి పరిష్కారం లేదు అంటూ బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ ఆజ్మీ సంచలన వ్యాఖ్య చేశారు. ఓ మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విధంగా కామెంట్ చేశారు.బంగ్లాదేశ్ లో తీవ్ర ఆందోళన పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతిన్నాయి. సందర్భం దొరికిన ప్రతిసారి ఆ దేశ నాయకులు ఈ విషయంగా తమ అక్కసును వెళ్ళగక్కుతునే ఉన్నారు.

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చలరేగిన ఆందోళనకర పరిస్థితుల్లో గతేడాది ఆగస్టు 5న ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దేశం వదలి భారత్ కు వచ్చి తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా అనంతరం మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆ తర్వాత అక్కడ శాంతి వాతావరణమేం నెలకొనలేదు. పైపెచ్చు అక్కడున్న మైనారిటీలు హిందువులపై విచక్షణా రహితంగా దాడులు జరిగాయి. ఈ విషయంగా భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది కూడా.

బంగ్లాదేశ్ లో చలరేగిన అల్లర్లు విధ్వంసం వెనక ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ హస్తం ఉన్నట్లు సమాచారం. వకార్ ఉజ్ జమాన్ గురించి భారత్ ముందస్తుగా హెచ్చరించినా ...షేక్ హసీనా ఆ విషయం పట్టించుకోకపోవడంతో అది ఆమె ఉనికికే ముప్పుగా మారింది. మొదట్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం వదలి పారిపోవాల్సి వచ్చింది. ఆమె పరారీ కావడంతో దేశంలో సైనిక పాలన వచ్చేసింది. అప్పట్లో బంగ్లాదేశ్ ఆర్మీచీఫ్ గా వకార్ ఉజ్ నను ప్రధానమంత్రి షేక్ హసీనాయే నియమించింది. ఈ విషయంగా భారత్ షేక్ హసీనాను హెచ్చరించింది. వకార్ ఉజ్ చైనా అనుకూల వ్యక్తి అని, ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలని అప్రమత్తం చేసింది. అయినా షేక్ హసీనా వినకుండా సైనిక అధ్యక్షుడిగా నియమించారు. చివరికి వకార్ ఆమెకు అల్టిమేటం ఇచ్చి దేశం నుంచి వెళ్లగొట్టారు.

ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అబ్దుల్ హిల్ అమాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా విముక్తికి భారత్ చేసిన సాయాన్ని మరచి ఆ దేశం నేతలు ఇష్టారీతిగా మాట్లాడ్డం తగదని అంటున్నారు. బంగ్లాతో భారత్ సంబంధాలు పునరుద్దరించుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రమాదకరంగా మారుతున్నాయి.