Begin typing your search above and press return to search.

17ఏళ్ల తర్వాత స్వదేశానికి మాజీ ప్రధాని కుమారుడు.. కొత్త చర్చ ఇదే!

గత కొన్ని రోజులుగా హింసాకాండలో మునిగిపోతున్న.. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న.. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

By:  Raja Ch   |   23 Dec 2025 9:14 AM IST
17ఏళ్ల తర్వాత స్వదేశానికి మాజీ ప్రధాని కుమారుడు.. కొత్త చర్చ ఇదే!
X

గత కొన్ని రోజులుగా హింసాకాండలో మునిగిపోతున్న.. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న.. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు జరిగే ప్రధాన రాజకీయ సంఘటనల్లో ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆ దేశ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు స్వదేశానికి తిరిగి వచ్చారు! ఇది తాజా రాజకీయ పరిణామాల్లో ఆసక్తిగా మారింది.

అవును... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్ లో ఓ ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు, రాజకీయ వారసుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) తాత్కాలిక ఛైర్ పర్సన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి తిరిగి రానున్నారు. ఈ సందర్భంగా వేడుక నిర్వహించుకోవడానికి బీ.ఎన్.పీ. అనుమతి పొందింది.

ప్రస్తుతం బంగ్లాను పాలిస్తున్న ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చాలామంది వాదిస్తున్న వేళ.. ప్రధానంగా విదేశాంగ విధానం విషయానికొస్తే.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బంగ్లా విదేశాంగ విధానం ఎలా ఉంటుందో తారిక్ రెహమాన్ స్పష్టంగా వివరించారు. ఎన్నికలు, సంస్కరణల అవసరాన్ని నొక్కి చెబుతూ.. దీర్ఘకాలిక విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకోవడంపై యూనస్ ఆదేశాన్ని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా స్పందించిన తారిక్ రెహమాన్.. రావల్పిండి లేదా ఢిల్లీతో బంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాలను కోరుకోదని.. బంగ్లాదేశ్ ను మొదటి స్థానంలో ఉంచుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ కాదు, పిండి కాదు, అన్నికంటే ముందు బంగ్లాదేశ్ అని ఢాకాలోని నయాపాల్టన్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రకటించారు. ఇది బంగ్లాదేశ్ కోసం ముహమ్మద్ యూనస్ రూపొందించిన విదేశాంగ విధానానికి ఇది చాలా భిన్నంగా ఉంది.

హసీనా, యూనస్ అలా.. తారిక్ రెహమాన్ ఇలా!:

మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అనుసరించిన విదేశాంగ విధానం విషయానికిస్తే... ఇది భారత్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. చైనా, భారత్ విషయానికొస్తే బంగ్లాదేశ్ ప్రయోజనాలను సమతుల్యం చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ తో సురక్షితమైన దూరాన్ని పాటించింది. అయితే... యూనస్ వచ్చిన తర్వాత.. భారత్ - బంగ్లా మధ్య ఉన్న చారిత్ర సంబంధాన్ని పణంగా పెట్టి పాకిస్థాన్ తో సన్నిహిత సంబంధాలు మొదలుపెట్టారు!

ఈ నేపథ్యంలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాని తారిఖ్ రహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇదే సమయంలో యూనస్ నేతృత్వంలోని తాత్కలిక ప్రభుత్వంతో కూడా అనేక అంశాలపై విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా... ఎన్నికలు నిర్వహించడంపై యూనస్ ప్రభుత్వంతో గొడవపడిన బీ.ఎన్.పీ ఒత్తిడి కారణంగానే ఫిబ్రవరిలో ఎన్నికలు ప్రకటించాల్సి వచ్చిందని అంటారు.

ఏది ఏమైనా సుమారు 17 ఏళ్ల తర్వాత.. సరిగ్గా బంగ్లాదేశ్ ఫ్యూచర్ డిసైడ్ చేసే, ఆ దేశ చరిత్రలోని అత్యంత కీలకమైన ఎన్నికలకు సుమారు నెలన్నర ముందు మాజీ ప్రధాని కుమారుడు దేశంలో అడుగుపెట్టడం ఆసక్తిగా మారింది. పైగా.. భారత్ కు పాక్ కు సమాన దూరం పాటించాలనే ఆయన విదేశాంగ విధాన స్టేట్ మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది!