మాజీ ప్రధాని బ్యాంక్ లాకర్ లో 10 కేజీల బంగారం!
బంగ్లాదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటాడుతోన్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 27 Nov 2025 9:15 AM ISTబంగ్లాదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటాడుతోన్న సంగతి తెలిసిందే. సుమారు గత ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్ లో ఈ నెలలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా... ఆమెకు ఇంటీవల బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ఐసీటీ) మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
అవును... బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం.. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటాడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెకు మరణశిక్ష విధించిన వేళ.. ఆమె అవినీతి చేశారని నిరూపించే / ఆపాదించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని అంటున్నారు. ఈ సమయంలో ఆమెకు చెందిన బ్యాంకు లాకర్ల నుంచి బంగ్లాదేశ్ లోని అవినీతి నిరోధక అధికారులు సుమారు $1.3 మిలియన్ల విలువైన 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఇందులో భాగంగా... సెప్టెంబర్ నెలలో స్వాధీనం చేసుకున్న లాకర్లను తెరిచిన తర్వాత ఈ విషయాన్ని కనుగొన్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెల్ (సీఐసీ) అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఆమె పదవిలో ఉన్నప్పుడు అందుకున్న కొన్ని బహుమతులను చట్ట ప్రకారం 'సోషఖానా' అని పిలవబడే ఖజానాలో డిపాజిట్ చేయడంలో విఫలమయ్యారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన సీఐసీ సీనియర్ అధికారి ఒకరు... కోర్టు ఆదేశాలను అనుసరించి తాము లాకర్లను తెరిచినట్లు తెలిపారు. ఆ సమయంలో మాజీ ప్రధానికి చెందిన 9.7 కేజీల బంగారాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. అందులో బంగారు నాణాలు, కడ్డీలూ, పలు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు నేషనల్ రెవెన్యూ బోర్డు కూడా పన్ను ఎగవేతపై దర్యాప్తు చేస్తోంది. ఆ పన్ను దాఖలులో ఈ బంగారాన్ని ప్రకటించారా లేదా అనేది పరిశీలిస్తోంది.
కాగా.. హసీనా పాలన ముగిసినప్పటి నుంచీ బంగ్లాదేశ్ రాజకీయ గందరగోళంలో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల ప్రచారాన్ని హింస దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. మరోవైపు.. విద్యార్థుల తిరుగుబాటుపై ఘోరమైన అణిచివేతకు పాల్పడినందుకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది.
దీనిపై హసీనా ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు అని మండిపడ్డారు. ప్రజా మద్దతు లేని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ విధించిన ఈ శిక్ష చెల్లదని ఆమె పేర్కొన్నారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు.. ఈ తీర్పును బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్న యూనస్ స్వాగతించారు.
