బంగ్లాదేశ్ కోసం భారత్ ఇంత త్యాగం చేసిందా ?
పళ్ళు తిని గింజలను ఇచ్చిన వారి మీదనే ఉమ్మడం అని విశ్వాసఘాతకులు విషయంలో అంటారు.
By: Satya P | 2 Jan 2026 8:29 AM ISTపళ్ళు తిని గింజలను ఇచ్చిన వారి మీదనే ఉమ్మడం అని విశ్వాసఘాతకులు విషయంలో అంటారు. ఇపుడు బంగ్లాదేశ్ విషయంలో అదే అనుకోవాలి అంటున్నారు. ఏ పాకిస్థాన్ పాలకుల చేతిలో నానా రకాలుగా నరకం అనుభవించి నలిగిపోయిందో ఆ దేశం ఇపుడు భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపిస్తోంది. ముఖ్యంగా అక్కడ హిందువుల విషయంలో అణచివేత విధానాలు కొనసాగుతున్నాయి అదే విధంగా దాడులు పెరిగాయి. భారత్ ని ఏదో చేయాలని అటు చైనాతో ఇటు పాక్ తో చేతులు కలిపేందుకు కూడా బంగ్లా నేతలు తహతహలాడుతున్న నేపథ్యం ఉంది.
రక్తం చిందించిన జవాన్లు :
బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి భారత్ సైనికులు వందలలో బలి అయ్యారు అని రక్తం చిందించారు అన్నది ఎందరికి తెలుసు అన్నదే ఇక్కడ ప్రశ్న. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం 435 మంది భారతీయ సైనికులు అధికారులు అమరులయ్యారు అన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇక భారత్ తరఫున యుద్ధంలో పాల్గొన్న 36 కంటే ఎక్కువ హంటర్ అలాగే జాగ్వార్ మిగ్ విమానాలు గల్లంతయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే డయ్యు తీరంలో అతిపెద్ద విషాదం ఆనాడు చోటు చేసుకుంది అని చెబుతారు. పాకిస్తాన్ నావికాదళం ఐ ఎన్ ఎస్ ఖుక్రీపై టార్పెడోలతో దాడి చేసి దానిని నాశనం చేసింది ఈ దాడిలో 136 మంది భారతీయ నావికా దళ సిబ్బంది మరణించారని అలాగే, అడ్మిరల్ సైతం తనువు చాలించారు అని చరిత్ర చెబుతోంది. దీనిని ప్రపంచ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన నావికాదళ దాడులలో ఒకటిగా చెప్పుకుంటారు.
వారంతా జైళ్ళలో :
ఇక మరో 56 మంది భారతీయ అధికారులు సైనికులు పాకిస్తాన్ జైళ్లలో ఆ సమయంలో ఖైదు చేయబడ్డారని చెబుతారు. అలా బంగ్లాదేశ్ అన్న కొత్త దేశాన్ని ప్రపంచ పటంలో సృష్టించడానికి భారతదేశం అపారమైన త్యాగాలు చేసింది. ఎంతో నష్టపోయింది. మరెంతో రక్తం చిందించింది. అంతే కాకుండా బంగ్లాదేశ్ శరణార్థులను పరిరక్షించడానికి అప్పట్లో ప్రతి భారతీయుడి కుటుంబం అదనం ఆర్థిక భారాన్ని భరించింది అంటారు. అలా సినిమా టిక్కెట్లపై అప్పట్లో రూపాయి ఇరవై పైసలు అదనపు ఛార్జీ విధించారని అంటారు. అలాగే రైలు ఛార్జీలను డెబ్బై అయిదు పైసలు పెంచితే అన్ని రాష్ట్రాలలో బస్సు ఛార్జీలను రూపాయి నుంచి నాలుగు రూపాయలకు పెంచారు. ఇలా ఒక్కో భారతీయ కుటుంబం దాదాపు 30 శాతం పైగా ఆర్ధిక భారం మోస్తే బంగ్లాదేశ్ శరణార్థులు అనబడే వారు బతికి బట్టకట్టారు.
కొత్త దేశాన్ని ఆదుకున్నారు :
బంగ్లాదేశ్ 1971లో కొత్తగా ఏర్పాటు అయింది. అన్నీ కొత్తే, ఆర్ధికంగా ఏమీ లేదు. ఆ సమయంలో అతి పెద్ద పొరుగు దేశంగా భారత్ నిలిచి ఎన్నో ఏళ్ళ పాటు ఆర్థికంగా ఆదుకుంది అని చెబుతారు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఆకలితో నిరాశ్రయులైన బంగ్లాదేశీయులకు ఢాకాలోని ఇస్కాన్ దేవాలయాలలో ఆహారం అందించబడిందని కూడా చెబుతారు. భారత్ కళాకారులు ఇతర దేశాలలో కార్యక్రమాలు నిర్వహించి మరీ సుమారు 14 మిలియన్ డాలర్లు సేకరించి బంగ్లాదేశ్‌కు ఆర్ధికంగా అండంగా నిలిచేందుకు పంపించారు. నాడు బంగ్లాల ఆకలిని తీర్చిన ఢాకాలోని అదే ఇస్కాన్ ఆలయం కొన్ని సంవత్సరాల క్రితం దహనం చేయబడి ధ్వంసం చేయబడిందని కూడా తెలిస్తే బాధ కలుగుతుంది.
పాక్ కంటే దారుణం :
పాకిస్తాన్ భారత్ ని ద్వేషించి వేరుగా ఏర్పాటు అయిన దేశం. బంగ్లాదేశ్ అలా కాదు భారత్ ని శరణుజొచ్చి ఆదుకోమని కోరి భారత్ అండతో ఏర్పాటు అయిన దేశం. భారత్ వల్ల పుట్టి భారత్ అండతో ఎదిగి ఈ రోజు భారత్ కడుపు మీదనే తన్నే విధంగా బంగ్లాదేశ్ వ్యవహరిస్తోంది అని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ కి హిందూ వ్యతిరేకత ఊపిరి. ఈ రోజున బంగ్లా కూడా పాక్ కి నకలు గా మారి హిందువుల మీద దాడితోనే తన మనుగడ సాగించే స్థితికి వచ్చింది అని అంటున్నారు. పాక్ తో కలిసి బంగ్లా భారత్ మీద తన ద్వేషాన్ని చూపించడం అన్నది చూస్తే బహుశా ప్రపంచంలో ఈ తరహా వెన్నుపోటు ఎక్కడైనా ఉంటుందా అన్నదే జాతీయ వాదులు అంతా చర్చించుకునే విషయంగా ఉంది.
