రాజకీయం.. భక్తిభావం.. ఓ బండ్ల గణేష్ పాదయాత్ర
నిర్మాత బండ్ల గణేష్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఎప్పుడూ తన మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే బండ్లన్న ఈసారి తన భక్తిని, కృతజ్ఞతను చాటుకునేందుకు కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నారు.
By: A.N.Kumar | 17 Jan 2026 4:49 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. నటుడు బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన శైలిలో భక్తిని, రాజకీయ అభిమానాన్ని చాటుకుంటూ ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు 'మహా పాదయాత్ర' చేపట్టనున్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఎప్పుడూ తన మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే బండ్లన్న ఈసారి తన భక్తిని, కృతజ్ఞతను చాటుకునేందుకు కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నారు. తెలంగాణలోని తన స్వగ్రామమైన షాద్‌నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వరకు సుమారు వందల కిలోమీటర్ల మేర సాగే ఈ 'మహా పాదయాత్ర' రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబుపై అభిమానమే ఈ యాత్రకు మూలం!
గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయన శ్రీవారిని వేడుకుంటూ... "చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మచ్చ లేకుండా సురక్షితంగా బయటకు రావాలి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి" అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారట. ప్రస్తుత 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తన మొక్కు నెరవేరిందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం, భక్తి శ్రద్ధలతో ఈ సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
జనవరి 19న ప్రారంభం
ఈ మహా పాదయాత్ర జనవరి 19వ తేదీన ప్రారంభం కానుంది. షాద్‌నగర్‌లోని తన స్వగృహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఎత్తున భక్తులు అభిమానుల సమక్షంలో తిరుమల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
భక్తికి.. రాజకీయానికి వారధిగా..
సాధారణంగా సెలబ్రిటీలు చేసే పాదయాత్రలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉంటాయి. కానీ బండ్ల గణేష్ చేపట్టిన ఈ యాత్ర పూర్తిగా తన వ్యక్తిగత విశ్వాసానికి.. అభిమానానికి నిదర్శనమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. "నేను నమ్మిన దేవుడు శ్రీవారు.. నేను ఇష్టపడే నాయకుడు చంద్రబాబు.. ఈ ఇద్దరి కోసమే నా ఈ పవిత్ర యాత్ర" అని బండ్ల గణేష్ తన మనోగతాన్ని చాటారు.
షాద్‌నగర్ నుంచి ఏడు కొండల వరకు సాగే ఈ ప్రయాణం శారీరకంగా కష్టతరమైనదే అయినా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆయన నిరూపించబోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ 'మహా పాదయాత్ర' విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుందాం.
