Begin typing your search above and press return to search.

10 లక్షలు.. బండి సంజయ్‌ ‘బంపర్ ఆఫర్’ రాజకీయ దుమారం

రాబోయే తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేడిలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   26 Nov 2025 11:57 AM IST
10 లక్షలు.. బండి సంజయ్‌ ‘బంపర్ ఆఫర్’ రాజకీయ దుమారం
X

రాబోయే తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేడిలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 11 నుంచి 17 వరకు మూడు దశల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి గ్రామానికి తక్షణమే రూ.10 లక్షల అభివృద్ధి నిధులను కేటాయిస్తానని ఆయన ప్రకటించడంపై అధికార, ప్రతిపక్షాల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

* బండి 'చెస్‌మూవ్' ఎందుకంటే?

గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉనికిని, పట్టును బలోపేతం చేసుకోవడానికి బీజేపీకి ఈ సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో ఎక్కువ గ్రామ పంచాయతీల్లో పట్టు సాధించడం ద్వారా రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు బలమైన పునాది వేయాలని బండి సంజయ్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది.

ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు : బండి

ఏకగ్రీవంగా బీజేపీ మద్దతు సర్పంచ్‌ను ఎన్నుకుంటే, రూ.10 లక్షలు వ్యక్తిగతంగా అందజేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఈ నిధులను ఎంపీ ల్యాండ్స్ నిధులు, కేంద్ర మంత్రిగా అదనంగా తెచ్చే కేంద్ర నిధులు, అలాగే గతంలో విద్యా, వైద్య రంగాలకు తెచ్చిన విధంగా కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులను వినియోగిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. పంచాయతీ అభివృద్ధిని బలోపేతం చేయడమే తొలి అడుగుగా ఈ రూ.10 లక్షల ప్యాకేజ్ ప్రకటించినట్లు తెలిపారు. "ఎటువంటి ఆలస్యం లేదు, కారణాలు లేవు," అని బండి సంజయ్ చేసిన ఈ హామీ, గ్రామీణ ఓటర్లలో తక్షణ ప్రభావాన్ని చూపగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

* అధికార పక్షం ఆరోపణలు, విమర్శలు

బండి సంజయ్ ఆఫర్‌పై అధికార పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. నిధుల ఎర వేసి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. "ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఒక కేంద్ర మంత్రిగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, నిధులను ఇలా బహిరంగంగా ప్రకటించడం పూర్తిగా అనైతికం," అని అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనుకుంటే, ఎన్నికల ముందు కాకుండా, ఎప్పుడైనా చేయవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాల గ్రామాలకు ఎంత ఇచ్చారో చెప్పాలి" అంటూ విమర్శించారు.

*బండి ఆఫర్‌కు లభిస్తున్న స్పందన ఎలా?

గ్రామాల్లో అభివృద్ధి నిధుల కోసం తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి షరతులు లేకుండా నేరుగా రూ.10 లక్షలు ఇస్తామని ఎంపీ హామీ ఇవ్వడం నిస్సందేహంగా గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా చెప్పొచ్చు.

లాభాలు-సవాళ్లు

నిధుల లభ్యత లేమితో బాధపడుతున్న చిన్న గ్రామాలకు ఈ రూ.10 లక్షలు గొప్ప అవకాశం. ఎన్నికల ఖర్చులు, విభేదాలు లేకుండా ఏకగ్రీవాలకు మొగ్గు చూపేవారు బీజేపీ మద్దతు వైపు తిరిగే అవకాశం ఉంది. కరీంనగర్ సెగ్మెంట్‌లో బీజేపీ గ్రామస్థాయిలో బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రకటించిన వెంటనే నిధులు విడుదల కాకపోతే, అది పార్టీపై వ్యతిరేకతకు దారితీయవచ్చు.

బండి సంజయ్ వేసిన ఈ ‘బంపర్ ఆఫర్’ అనే తొలి రాజకీయ అస్త్రం కరీంనగర్ గ్రామీణ ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో, రాబోయే రోజుల్లో మిగతా పార్టీల ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఆఫర్ మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఎంపీలపైనా ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు.